స్కాట్లాండ్ పై టీమిండియా అలవోక విజయం

పసికూన స్కాట్లాండ్ పై ఘనవిజయం సాధించింది కోహ్లీసేన. మనోళ్ల బౌలింగ్ తాకిడికి తట్టుకోలేక చాలా తక్కువ స్కోర్ కే కుప్పకూలింది. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌ కు దిగిన స్కాట్లాండ్‌ టీమ్ 85 పరుగులే చేసింది. జార్జ్‌ మున్సీ (24), లియాస్క్ (21) మినహా ఎవరూ 20 పరుగుల కంటే ఎక్కువ రన్స్ చేయలేదు. భారత్‌ బౌలర్లలో జడేజా 3, షమీ 3, బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.

86 పరుగుల అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది కోహ్లీసేన. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎప్పుడెప్పుడు మ్యాచ్ ను క్లోజ్ చేద్దామా అని భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్ నుంచే సిక్సులు, ఫోర్లు కొడుతూ వచ్చారు. అయితే ఐదో ఓవర్ లాస్ట్ బంతికి రోహిత్ శర్మ(30) ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 70.

ఆరో ఓవర్ లో కేఎల్ రాహుల్ భారీ సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో రాహుల్ కు హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్ లోనే మ్యాచ్ ముగించేద్దామని భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు రాహుల్. ఏడో ఓవర్ లో సూర్యకుమార్ భారీ సిక్స్ కొట్టడంతో విజయతీరాలకు చేరింది టీమిండియా.