‘రాజీవ్ ఖేల్ రత్న’ వాపసు చేస్తా: విజేందర్ సింగ్

కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకుంటే తనకు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వాపసు చేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. సింఘు సరిహద్దు (హర్యానా-ఢిల్లీ సరిహద్దు) వద్ద రైతులు జరుపుతున్న ఆందోళనల్లో ఆదివారంనాడు ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మా పెద్ద సోదరులైన పంజాబ్ రైతులు ఇక్కడ ఉండటంతో తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుంటే తనకిచ్చిన అత్యున్నత క్రీడా అవార్డయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వాపసు చేస్తానని చెప్పారు. రైతులు మధ్య ఐక్యత అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు.

విజేందర్ సింగ్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రైతు ఆందోళనలు కొనసాగుతుండటంతో వారికి మద్దతుగా జాతీయ బాక్సింగ్ కోచ్ గుర్‌ప్రకాష్ సంధు తనకు ప్రదానం చేసిన ద్రోణాచార్య అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు.