తెలంగాణ ప్రభుత్వ సరికొత్త పథకం గర్భిణులకు ‘లంచ్‌బాక్స్‌’

సంపూర్ణ ఆరోగ్య సమాజమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ‘లంచ్ బాక్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రారంభమైంది. వైద్య పరీక్షలకు వచ్చిన రోజు భోజనంలో గుడ్లు, పాలు, ఆకుకూరలతో కూడిన ఆహారం అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వాటి పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అధికారులు లంచ్‌ను సరఫరా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కొన్ని సెంటర్లలోనే అమలవుతోంది.