అనేక పదవులకు వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారు: అమిత్‌షా

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేపట్టిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారని కొనియాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దులో వెంకయ్య పాత్ర మరువలేనిదన్నారు. ఎంత ఎదిగినా మూలాలను మరచిపోవద్దని, వెంకయ్య ఏనాడూ మాతృభూమిని మరువలేదని అన్నారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలంటూ పరితపిస్తుంటారని చెప్పారు.

మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్న గొప్ప వ్యక్తి అని శ్లాఘించారు. విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశారని, జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో ఎమర్జెన్సీపై గొంతెత్తారని అన్నారు. జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వెంకయ్య ఎప్పుడూ రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల గురించే ఆలోచించేవారన్నారు. ఆయన గురించి ఆయన స్వస్థలంలో మాట్లాడాలన్న తన కోరిక ఇవాళ తీరిందని హర్షం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు సిఫార్సుల మేరకే పద్మ అవార్డులు వచ్చేవని, ఇప్పుడు దానిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. ప్రతిభ, సేవతోనే పురస్కారాలు వరిస్తున్నాయన్నారు. అతి సామాన్య గిరిజనులకూ పద్మ పురస్కారాలను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాళ్లకు చెప్పులు లేని వ్యక్తులు కూడా రాష్ట్రపతి భవన్ కు వస్తున్నారని అన్నారు.