వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలు తారా స్థాయికి చేరాయి

•ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రత్యర్ధులపై దాడులు చేస్తున్నారు
•ఈ గొడవలు బీజేపీతోనే మొదలు పెట్టారు
•విజయనగరంలో ఆ పార్టీ కార్యకర్త పొట్ట కోసేశారు
•ఈ వ్యవహారం మీద చాలా రోజులుగా ఉభయ పార్టీల మధ్య చర్చ జరుగుతోంది
•విశాఖ పరిణామాల నేపధ్యంలో మద్దతు తెలిపిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు
•జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు భేటీ.. అనంతరం మీడియాతో భేటీ

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రత్యర్ధి పార్టీల వ్యక్తులను బతకనీయడం లేదని, దాడులతో భయపెడుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ గొడవలు ఉత్తరాంధ్రలో బీజేపీ కార్యకర్తల నుంచి వైసీపీ మొదలు పెట్టిందన్నారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తని కత్తులతో పొట్ట కోసేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తారా స్థాయికి చేరిపోయాయన్నారు. సోమవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు సమావేశమయ్యారు. విశాఖ ఘటనలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ “విశాఖలో జనసేన నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. గతంలో విజయనగరంలో బీజేపీ కార్యకర్తని కత్తులతో పొట్ట కోసేస్తే పేగులు బయటికి వచ్చేసిన పరిస్థితి. కడపలోనూ వారి నాయకుల మీద దాడి చేశారు. ఈ విషయాల మీద చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు శృతి మించడంతో మద్దతు తెలిపేందుకు శ్రీ సోము వీర్రాజు గారు స్వయంగా వచ్చారు. వారితో పాటు విశాఖలో పరిణామాల మీద ఎప్పటికప్పుడు వాకబు చేసిన శ్రీమతి పురందేశ్వరి గారికి, శ్రీ సునిల్ దేవధర్ గారికి, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి, ఎమ్మల్సీ మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు.
•వైసీపీ దమనకాండను కలసికట్టుగా ఎదుర్కొంటాం: సోము వీర్రాజు
బిజెపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దమనకాండను జనసేన, బీజేపీ కలసి ఎదుర్కొంటాం. పవన్ కళ్యాణ్ గారి పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు, వారిని నెడుతూ మాట్లాడడం వంటివి ప్రజాస్వామ్యంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు. ఒక ప్రజా నాయకుడు, ప్రజల్లో పలుకుబడి ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. రైతులకు అండగా నిరంతరాయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. వారు వెళ్లే సమయంలో వైసీపీ నాయకులు వారికి వారుగా ఉద్యమం చేస్తూ, ప్రజల్లో ఏదో మూమెంట్ ఉందని తెలియచేసేందుకు చేపట్టిన ప్రజావ్యతిరేక ఉద్యమాలను అడ్డు పెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమానికి వెళ్లిన సమయంలో నిర్భంధించడం, జనసేన కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్దం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ దమనకాండను కేంద్ర పెద్దల వద్ద ప్రస్థావించాము. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ దుశ్ఛర్యలపై ముందుకు వెళ్లమన్నారు. వీటిని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటాము. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఉద్యమం చేయమని కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్పారు. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామ”న్నారు.