అధికారం ఉంటేనే సమస్యలు వింటామని చెప్పం

*జనసేన ఎప్పుడూ ప్రజల మధ్యన ఉంటూ.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది
*“జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమ ప్రారంభోత్సవంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, అధికారంలో ఉంటేనే చేస్తామని చెప్పదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అధికారం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పని చేస్తామని చెప్పారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమం ప్రారంభించారు. ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా వినతులు స్వీకరిస్తున్నారు. మొదటి సమస్యగా ముఖ్యమంత్రి భద్రత పేరిట తాడేపల్లిలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయించి, పరిహారం చెల్లింపు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన విషయాన్ని శ్రీమతి శివశ్రీ అనే మహిళ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను గతంలో జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చిన తర్వాత తన అన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఇప్పటి వరకు పోస్టుమార్టం రిపోర్టు కూడా అందకుండా అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆయనకు చెప్పుకున్నారు. సమస్యను సావధానంగా విన్న అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..
• వైసీపీ క్రిమినల్స్ కి వంత పాడుతోంది
ఏడాది క్రితం శ్రీమతి శివశ్రీ అనే ఆమె జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్య చెప్పుకున్న రెండు రోజులకే ఆమె ఇల్లు కూల్చేశారు. అక్రమ కేసులు బనాయించారు. ఆమె సోదరుడు శ్రీ అనిల్ కుమార్ ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లి మూడు రోజుల తర్వాత శవమయ్యారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి విచారణ లేదు. కనీసం పోస్టు మార్టం రిపోర్టు ఇవ్వలేదు. వైసీపీ క్రిమినల్స్ ని ఆదరించే పార్టీ..నష్టం వచ్చిన వారి పక్షాన నిలబడే పార్టీ కాదు. మంత్రి వర్గం, నాయకులు క్రిమినల్స్ ని వెనకేసుకు వస్తారు.. రేపల్లె పోలీస్ స్టేషన్ అత్యాచార ఘటనలో కూడా క్రిమినల్స్ ని వెనకేసుకు వచ్చారు. శ్రీమతి శివశ్రీ సమస్యను జనసేన పార్టీ ముందుండి న్యాయం జరిగేలా చేస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం, ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్ర బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
• రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన జనం
రాష్ట్ర నలు వైపుల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున “జనవాణి” కార్యక్రమానికి తరలి వచ్చారు. ప్రతి సమస్యను సావధానంగా విని పవన్ కళ్యాణ్ గారు అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ వెంటనే పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సమస్య స్వీకరించినట్టు రసీదులు అందచేస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ నేతృత్యంలోని బృందం రేపటి నుంచి ఆయా ప్రభుత్వ విభాగాలతో అనుశీలన చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు.