నగర ఓటర్లకు సినీ తారల పిలుపు

జీహెచ్‌ఎంసీలో జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించిన సెలవును ఇతర పనులకు కాకుండా ఓటేసేందుకు వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు ఏ పార్టీ అయితే సరైనదో అంచనాకు వచ్చి.. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతంలోపే నమోదైంది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ఈసారి సెలబ్రెటీలతో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా టాలీవుడ్ హీరోలు కింగ్ నాగార్జున, విజయ్ దేవరకొండతో ఒక వీడియోను రూపొందించింది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందించారు. జీహెచ్ఎంసీతో కలిసి ఓటరును చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. బల్దియా రూపొందించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే వీడియోలో నాగ్ తన సందేశాన్ని ఇచ్చారు. ”మన నగరం… మన రాజధాని… మన హైదరాబాద్… మన భవిష్యత్… మన పాలన… మన ఓటు… అన్నీ మన చేతిలోనే ఉన్నాయి.. ఓటు వేద్దాం… మన శక్తిని చూపిద్దాం… ” అని పవర్ ఫుల్ మెసేజ్ సిటీ ఓటరుకు ఇచ్చారు…

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ రూపొందించిన వీడియోలో ఓటర్లను విజయ్ ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. అందులో మాట్లాడుతూ…”అందరికీ నమస్కారం… డిసెంబర్ 1న హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. నగర పౌరులు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరిస్తూ పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయండి…” అని విజయ్ పిలుపునిచ్చారు.