సీఎం తన ఆర్భాటాలకు కోట్లు ఖర్చు చేస్తారు… యలమంచిలిలో రెండున్నర కోట్లతో బ్రిడ్జ్ కట్టలేరా?

* ప్రజల కడుపుకొట్టి సంపాదించిన సొమ్ముతో ప్రశాంతంగా ఎవరూ బతకలేరు
* దశాబ్దాలు గడుస్తున్నా శారద నది గట్టుకు శాశ్వత చర్యలు తీసుకోలేదు
* యలమంచిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘ప్రచార ఆర్భాటాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఏకంగా తన ఇంట్లో కోట్లు ఖర్చు చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం సెట్ వేస్తారు. కానీ యలమంచిలి వాసుల చిరకాల వాంఛ అయిన ఫ్లై ఓవర్ పూర్తి చేయడానికి రూ.రెండున్నర కోట్లు నిధులు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేద’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు అన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల పొడవుండే ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తే 20 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని తెలిసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని స్పష్టం చేశారు. గురువారం యలమంచిలిలో నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “యలమంచిలి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించి దాదాపు 13 ఏళ్లు కావస్తోన్నా ఇప్పటి వరకు బ్రిడ్జ్ మాత్రం పూర్తి కాలేదు. మరో రెండున్నర కోట్లు ఖర్చు చేస్తే బ్రిడ్జ్ పూర్తవుతుందని తెలిసినా వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. కనీసం మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడిగినా పెద్ద మనసుతో రెండున్నర కోట్లు ఇచ్చి ఉండేవారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఎప్పుడు మత్తులో జోగుతూ జూదంలో బతుకుతుంటారని చెబుతున్నారు….ఆయన జూదం కోసం చేసిన ఖర్చు బ్రిడ్జ్ నిర్మాణానికి ఇస్తే ఈపాటికే పూర్తయ్యేది. ఎన్.ఏ.ఓ.బి. వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోలేకపోయారు. ప్రతి ఏటా శారద నదికి వరదలు రావడం రాంబిల్లి మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురవ్వడం, వేలాది ఎకరాలు పంట నీట మునగడం సర్వసాధారణం అయిపోయింది. ముంపు జరగకుండా శాశ్వత పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. బ్రాండిక్స్ కంపెనీలో 60 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 22 వేలే ఇచ్చారు. దీనిపై ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఒక్క యలమంచిలి నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చివరి నిమిషంలో నోటు ఇస్తే జనమే ఓట్లు వేస్తారనే భ్రమలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మనందరం కళ్లు తెరిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రం అభివృద్ధి అంధకారంలోకి వెళ్లిపోతుంది.
• సమస్యలపై మాట్లాడమంటే … సినిమా వాళ్ల సంపాదనపై మాట్లాడతారు
పార్లమెంట్ సభ్యులంటే ఎలా ఉండాలి..? స్థానిక సమస్యలపై పార్లమెంటులో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో పోరాడాలి. అవన్ని వదిలేసి వైసీపీ ఎంపీలు మాత్రం సినిమా వాళ్ల సంపాదన మీద, ఫోటోలు సరిగా రాకపోవడం మీద మాట్లాడతారు. తెలంగాణ, తమిళనాడు ఎంపీలకు ఉన్న పట్టుదల మన వాళ్లకు ఉండదు. యలమంచిలిలో సరైన ఆస్పత్రి లేదు. పెద్దాసుపత్రికి వెళ్లాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఇంతలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చూడాలన్న స్పృహ వాళ్లకు లేదు.
• వైసీపీలో ఉండే బఫూన్లు, జోకర్లు ఏ పార్టీలో లేరు
వైసీపీలో ఉండే జోకర్లు, బఫూన్లు మరే పార్టీలో ఉండరు. రోడ్ల మీద డ్యాన్సులు వేయడం. అడ్డమైన కూతలు కూయడం. ఆడ, మగ తేడా లేకుండా బూతులు తిట్టడం. ఇతరుల జీవితాల్లో దూరి బురదజల్లడం.. ఇదే వాళ్ల పని. ముఖ్యమంత్రిని పాలనపరంగా విమర్శించినందుకు తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా షర్మిలను దుర్భాషలాడిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. 2024లో వచ్చేది జనసేన- టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజక వర్గం ఇంచార్జీ శ్రీ సుందరపు విజయ్ కుమార్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుందరపు వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *