వైసీపీ నాయకులకు తెలిసింది దోచుకోవడం… దాచుకోవడమే

• విశాఖ నగరం… చుట్టు పక్కల వందల కోట్ల విలువ చేసే భూములు దోచేశారు
• ప్రజలకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే
• వైసీపీ వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది
• కలసికట్టుగా పని చేస్తేనే వైరస్ ను అంతం చేయగలం
• పెందుర్తి నియోజకవర్గ నాయకుల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత వలస పోతున్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. సామాన్యుడి జీవితం చిందరవందరగా మారిపోయింది. ప్రభుత్వ పని తీరుపై ఎవరైనా ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి నిరంకుశత్వ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండద’ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు అన్నారు. ప్రజలకు న్యాయం చేయని ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒక్కటే ఊడినా ఒక్కటేనని అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న శ్రీ నాగబాబు గారు గురువారం పెందుర్తి నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తే… 2019లో ఆంధ్రాకు పట్టిన వైసీపీ వైరస్ రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసింది. వైసీపీ వైరస్ తరువాత వచ్చిన కరోనాకు వ్యాక్సిన్ కనుక్కొన్నాం. దాదాపు ఐదేళ్లుగా ఆ వైరస్ రాష్ట్ర ప్రజలను పట్టిపీడిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం పార్టీల గెలుపే ఆ వైరస్ కు మందు.
• దోచుకోవడమే అజెండా
పెందుర్తి నియోజకవర్గం పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. దశాబ్దాలుగా పంచగ్రామాల భూ సమస్య వేధిస్తోంది. పరవాడ కాలుష్యం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు తగిన న్యాయం చేయలేకపోయారు. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖ నగర తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీర్చే సుజల స్రవంతి పనులు నత్తనడనక సాగుతున్నాయి. ప్రభుత్వాలు, నాయకులు మనసుపెడితే ఎంతో కొంత చేయవచ్చు. కానీ ఎవరికి ఏమీ పట్టదు. గెలిచామా? సంపాదించుకున్నామా? అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కానీ మన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం అలాంటిది కాదు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వలసలు నిరోదించి యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉమ్మడి ప్రభుత్వంలో సరికొత్త మార్పును తీసుకొస్తాం. ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వం, మంచితనాన్ని వాడుకొని నాయకులు, వారి కుటుంబాలు ఎదిగాయి తప్ప … ఈ ప్రాంత అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలుగా దాటినా ఇప్పటికీ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారంటే ఎంత దుర్మార్గమైన పాలన సాగిందో అర్ధం చేసుకోవచ్చు. రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది ఫ్యాక్షనిస్టులు, రౌడీలు విశాఖ, దాని చుట్టుపక్కల వందల కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశారు. వాళ్ల ధన దాహానికి చాలా మంది బలైపోయారు. దళిత సామాజిక వర్గానికి చెందిన డా.సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్క్ లు లేవని మాట్లాడినందుకు … వేధించారు. ఆ వేదనతోనే మృతి చెందారు. చాలా మంది వైసీపీ నాయకులు అహంకారం తలకెక్కి నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నారు. ప్రభ్యుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. చివరకు సామాన్యుడిని కూడా వదలకుండా దోచుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని ఎంత కాలం భరించాలి…?
• వీళ్ళు మంత్రులా?
మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగితే తల్లి పెంపకం సరిగా లేదని ఒక మంత్రి మాట్లాడుతుంది. చదువు ఎక్కువైపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని మరో మంత్రి సెలవిస్తారు. రోడ్లు కావాలా? సంక్షేమ పథకాలు కావాలా? అని ఇంకో మంత్రి డిమాండ్ చేస్తాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రోడ్లు వేయరా? ఏం మాట్లాడతారు వీళ్లు. ఇలాంటి వాళ్లను మళ్లీ ఎన్నుకుంటే వైసీపీ వైరస్ కు రాష్ట్రం బలవ్వకతప్పదు. ఆ వైరస్ ను నిర్మూలించడానికే జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రతి ఒక్కరం సైనికుల్లా పోరాడి వైరస్ ను అంతం చేద్దాం. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి అన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. వాళ్లు ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్లను గెలిపించుకునే బాధ్యత మనది. అభిప్రాయభేదాలు పక్కన పెట్టి కలసికట్టుగా పని చేద్దాం. టీడీపీ పోటీ చేసిన చోట మనం… మనం పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ వాళ్లు పరస్పరం సహకరించుకుంటే రాష్ట్రానికి పట్టిన వైరస్ ను తరిమికొట్టగలం. ఇప్పటం సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని దానికి కట్టుబడే ఈ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందనే నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో తండ్రిని చూసి కొడుకును గెలిపించారు. ఇప్పుడు మీ బిడ్డల భవిష్యత్తను చూసి జనసేన- టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాల”ని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుందరపు వెంకట సతీష్, పార్టీ అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయ్ కుమార్ తోపాటు నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
• విశాఖ సౌత్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రీ నాగబాబు
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కార్పొరేటర్ శ్రీ మహ్మద్ సాధిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రీ నాగబాబు గారు ప్రారంభించారు. ఇస్లాం మత పెద్దలు ప్రార్థనలు చేసిన అనంతరం శ్రీ నాగబాబు గారు పార్టీ నాయకులతో కలిసి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ నాగబాబు గారికి జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మేళతాళాలు, పూలవర్షంతో స్వాగతం పలికాయి.