ప్రభుత్వ అసమర్థతకు బలైన విద్యార్థుల భవితవ్యం

  • రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కనీసం పిల్లలకు ఉన్నతమైన విద్యను కూడా అందించలేరా?
  • దేశంలోనే అతిపెద్ద బ్రోకర్ సజ్జల రెడ్డి.
  • వైసీపీ పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అంటూ ఎదురుచూస్తున్న ప్రజలు.
  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.

గుంటూరు, రాష్ట్రంలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, కనీసం విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించటంలో సైతం పూర్తిస్థాయిలో వైసీపీ నాయకత్వం వైఫల్యం చెందిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ అసమర్ధ కారణంగా విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడబిడ్డలపై అత్యాచారాలకు తల్లుల పెంపకాన్ని, విద్యార్థులు చదువులో పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రుల మార్గదర్శకం బాగా లేదంటూ ప్రభుత్వం వింత వాదన చేస్తూ తమ పరిపాలనా బాధ్యత నుంచి తప్పించుకోవటం సిగ్గుచేటన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రణాళికను పటిష్ట పరచకుండా విద్యార్థుల సంఖ్యకు తగ్గ స్థాయిలో ఉపాధ్యాయులను నియమించకుండా కేవలం నాడు – నేడు పేరుతో బడులకు రంగులేసినంతమాత్రాన విద్యార్థులు పాస్ అవ్వరని విమర్శించారు. విద్య వ్యవస్థలో ఉన్న లోపభూయిష్టలను సరిచేయకుండా ఇంగ్లీష్ లో బోధన చేయిస్తాం అంటూ విద్యార్థుల భవితవ్యాన్ని సైతం ఓటు బ్యాంకు రాజకీయాలకు బలి చేయటం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులను పిల్లలకు విద్యాబోధన చేయించడం కన్నా మద్యం షాప్ ల దగ్గర కాపలా పెట్టడం, మరుగుదొడ్ల ఫోటోలు తీయిన్చటం లాంటి పనులు చేపిస్తే ఇలాంటి ఫలితాలు రాకుండా ఇంక ఎలాంటి ఫలితాలు వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవటాన్ని జనసేన సహించదని ఫెయిల్ అయిన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రీ కౌంటింగ్ కు ఆ పైన సప్లిమెంటరీ పరీక్షను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచితవ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అతిపెద్ద బ్రోకర్ సజ్జల రెడ్డిఅని అన్నారు. సలహాదారు పేరుతో ప్రజల డబ్బుతో కులుకుతున్న సజ్జల రెడ్డికి పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత లేదన్నారు. 151 మంది శాసనసభ్యులను డమ్మీలని చేసి అంతా తానై రాష్ట్రంలో పరిపాలనా నీచత్వానికి సజ్జల రెడ్డి పాల్పడుతున్నాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద బఫున్ ఎవరన్నా ఉన్నారంటే అది సజ్జల మాత్రమే అని ఇంకోసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మంత్రి వర్గ విస్తరణలో నువ్వు చేసిన బ్రోకరిజం మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ
రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యులు ప్రజల నుంచి వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ ని, జనసేనను అసందర్భంగా విమర్శించటం పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మంత్రి రోజా నోటికైతే అద్దుపొద్దు ఉండటం లేదని తనకిచ్చింది పర్యాటక శాఖ అన్న విషయం మరచిపోయి పవన్ కళ్యాణ్ ని విమర్శించే శాఖ అనుకుంటుందని ఎద్దేవా చేశారు. తనని గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని మరచి జబర్దస్త్ షో చేయటాన్ని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో డ్రామాలు వేయటాన్ని పార్ట్ టైమ్ రాజకీయాలు అంటారని ధ్వజమెత్తారు. మీరు అనుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ చేస్తున్న రాజకీయాలకే వైసీపీ నేతలకు పార్ట్ లన్నీ వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. గడప గడపలో ప్రజల నుంచి ఎదురవువుతున్న ఛీత్కారాలకు, సామాజిక న్యాయ భేరీ పేరుతో చేసిన బస్సు యాత్ర తుస్సు జాతరగా మిగిలిపోవటంతో వైసీపీ నేతలకు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ని విమర్శించటంలో ఉన్న శ్రద్ధ పరిపాలనా పై పెడితే రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు అన్నా దక్కుతాయని ఆళ్ళ హరి హితవు పలికారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ పాల్గొన్నారు.