వైసీపీ నేతల ధనదాహానికి యువత భవిష్యత్ నిర్వీర్యమైపోతుంది: ఆళ్ళ హరి

  • రాష్ట్రాన్ని స్మగ్లింగాంధ్రప్రదేశ్ గా మార్చారు
  • తమ దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తుకు బానిసను చేశారు
  • అధికారమిచ్చింది దోచుకోవటానికే అన్నట్లుగా పాలన
  • రాష్ట్రమంతటా వైసీపీ నేతల రూపంలో వీరప్పన్ లు
  • దాష్టీకాలను ప్రశ్నిస్తే దాడులు, ఆగడాలను అడ్డుకుంటే వేధింపులు
  • ఆరు కోట్ల ఆంధ్రుల ఉసురుతో వైసీపీ భూస్థాపితం అవుతుంది
  • గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైసీపీ ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టిందో ఆ క్షణం నుంచి రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తుందని, చివరికి వైసీపీ నేతల ధనదాహానికి యువత భవిష్యత్తు సైతం నిర్వీర్యమైపోతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం మొత్తంలో అత్యధికంగా మాధకద్రవ్యాలు ఆంద్రప్రదేశ్ లోనే పట్టుపడ్డాయని స్మగ్లింగ్ ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే 18,627 కిలోల మత్తుపదార్ధాలను అధికారికంగానే పట్టుకుంటే అనధికారికంగా ఇంకెన్ని వేల కిలోలు తరలిస్తున్నారో తలుచుకుంటేనే భయం వేస్తుందన్నారు. గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్ధాలకు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. చిన్న చిన్న బడ్డి కొట్లలోనూ, మాల్స్ లోనూ వక్కపొడి పాకెట్ దొరికినంత సులువుగా గంజాయి పొట్లాలు దొరుకుతున్నాయన్నారు. కొన్ని కాలేజీలు మాదకద్రవ్యాలకు నిలయంగా మారినా కాలేజీ యాజమాన్యాలు కానీ పోలీసులు కానీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. మత్తుకు అలవాటు పడ్డవారు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారని అక్షణంలో తామేమి చేస్తున్నామో తెలియని స్థితిలో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమ దోపిడీని ప్రశ్నించకుండా ఉండేందుకు వైసీపీ నేతలే కాలేజీ విద్యార్థులను, యువతను మత్తుకు బానిసల్లా మార్చారని ధ్వజమెత్తారు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు వైసీపీ నేతల దోపిడీకి పంచభూతాలు చాలటం లేదని విమర్శించారు. తమిళనాడులో ఒక్క ఎర్ర చందనం మాత్రమే వీరప్పన్ దోచుకునేవాడని కానీ ఆంద్రప్రదేశ్ లో సహజవనరులైన ఇసుక, మట్టి, ఎర్ర చందనంతో పాటూ అక్రమ మద్యం, భూములు దోచుకోవటానికి వైసీపీ నేతలే ఒక్కో వీరప్పన్ అవతారం ఎత్తుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకువటానికే అన్నట్లు వైసీపీ నేతలు పాలిస్తున్నారని విమర్శించారు. తమ దాష్టీకాలను ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్ అంటే నమ్మి మోసపోయామని బాధపడని వర్గం లేదని, ఆరు కోట్ల ఆంధ్రుల ఉసురు తగిలి వైసీపీ ప్రభుత్వం త్వరలోనే భూస్థాపితం అవుతుందని ఆళ్ళ హరి అన్నారు.