ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం: శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంధం వారి పాలెంలో ప్రజలు మంచి నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి పూర్తి స్థాయిలో మంచి నీరు రాకపోవడంతో ఆందోళన చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఖాళీ బిందెలతో ప్రదర్శన చేయడం జరిగింది. తొలుత ఆర్డిఓ కార్యాలయం బయట బైఠాయించిన మహిళలు, జనసైనికులు అనంతరం ఆర్డీవో ఆఫీస్ కార్యాలయంలో మంచినీరు కల్పించండి మహాప్రభో అని నినాదాలు చేస్తూ బైఠాయించడం జరిగింది. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సమావేశానికి వెళుతున్న ఆర్డివో కారుకు అడ్డుబడి మహిళలు ఆవేదనతో మంచి నీరు కల్పించండి, మంచి నీరు లేకపోతే మేము గ్రామానికి తిరిగి వెళ్లలేమని మొరపెట్టుకోవడం జరిగింది. దాంతో ఆర్డీవో స్పందించి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో మాట్లాడుతానని తాత్కాలికంగా మంచినీరు ఏర్పాటు చేస్తానని మాటివ్వడం జరిగింది. తదుపరి రాజబాబు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని, గంధం వారి పాలెంలో గత కొంతకాలంగా మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న మహిళల పాట్లు వర్ణనాతీతం అని తక్షణమే గంధం వారి పాలెంనకు మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంధం వారి పాలెం మహిళలు, జనసేన నాయకులు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, గోలకోటి వెంకటేష్ పట్టణ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.