మరోసారి దగాపడ్డ ధాన్యం రైతు

*ఏటా పెరిగిపోతోన్న వరి సాగు ఖర్చులు
*పొంతనలేని అంచనాలతో మద్దతు ధరల నిర్ణయం
*తేమ, నూక పేరుతో మద్దతు ధరలో కోతలు
*వరి సాగు గిట్టుబాటుకాక తగ్గిన పంట విస్తీర్ణం
*బోనస్ ఇచ్చే ఆలోచన చేయని రాష్ట్ర ప్రభుత్వం

వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటికేడాది సాగు ఖర్చులు పెరిగిపోవడం, కేంద్రం ఇస్తోన్న మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, తేమ, నూకల పేరుతో ధరలో కోతలు వేయడం, వెరసి వరి సాగు సంక్షోభంలో పడింది. గడచిన ఖరీప్, రబీల్లోనే ఆంధ్రప్రదేశ్ లో వరి సాగు 9 లక్షల ఎకరాలు తగ్గిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. వరి సాగు ఏ మాత్రం గిట్టుబాటు కాకపోవడం, కేంద్రం ఇస్తున్న మద్దతు ధర కూడా రైతులకు దక్కక పోవడంతో సాగుకు రైతులు స్వస్థి చెబుతున్నారు. అష్టకష్టాలు పడి వరి సాగు చేసినా, ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లకు, రైతులు ఎదురు సొమ్ములు ఇవ్వాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో నెలకొంది.
*వరి సాగు ఖర్చు తేల్చడంలోనూ తిరకాసు
వరి సాగు ఖర్చులు తేల్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.2084 ఖర్చవుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, క్వింటా ధాన్యం ఉత్పత్తికి కేవలం రూ.1455 మాత్రమే ఖర్చవుతోందని కేంద్రం ప్రకటించింది. దీని ఆధారంగానే మద్దతు ధర నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా క్వింటా ధాన్యానికి రూ.2183 మద్దతు ధర ప్రకటించింది. ఈ మొత్తం కూడా రైతుకు దక్కడం లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. దేశంలో వరి సాగుకు అత్యధికంగా ఖర్చయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ తరవాత ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఎకరా వరి సాగుకు రూ.45306, ఏపీలో రూ.41423, కేరళలో రూ.40364 ఖర్చవుతోంది. వరి సాగు ఖర్చులు పెరిగి, కేంద్రం ఇస్తోన్న మద్దతు ధర కూడా గిట్టుబాటు కాకపోవడంతో పలు రాష్ట్రాలు వరి సాగు రైతులకు బోనస్ అందిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం 2022-23లో క్వింటాకు రూ.780, తమిళనాడు క్వింటాకు రూ.100, ఝార్ఖండ్ రూ.100 బోనస్ అందించాయి. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటోన్న ఏపీ సర్కార్, వరి సాగు రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయడం లేదు. బోనస్ పక్కన పెడితే ఏపీలో వరి రైతుకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధాన్యం అమ్మిన రైతుకు నెలల తరబడి డబ్బు ఇవ్వకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది.
*అంచనాలకు దూరంగా దిగుబడి
క్వింటా వరి ధాన్యం ఉత్పత్తికి రూ.2084 ఖర్చవుతోంది, 2023-24 సంవత్సరానికి క్వింటా ధాన్యానికి రూ.3126 మద్దతు ధర ఇవ్వాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన గణాంకాలను పక్కన పడేసిన కేంద్రం, క్వింటా ధాన్యం పండించడానికి రూ.1455 ఖర్చవుతోందని లెక్కగట్టింది. దీని ఆధారంగా తాజాగా మద్దతు ధరను క్వింటాకు రూ.143 పెంచి రూ.2183 మాత్రమే నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత ధర కన్నా కేంద్రం రూ.943 తక్కువ ప్రకటించింది. ఎకరాకు సగటున 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనాతో కేంద్రం ఈ మద్దతు ధర ప్రకటించింది. కానీ ఆంధ్రలో 2019-20లో ఎకరాకు సగటున 21 క్వింటాళ్లు, 2020-21లో 17.21 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న 24 క్వింటాళ్ల దిగుబడి గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు.
*నష్టం మిగిలిస్తున్న సాగు
ఖరీఫ్ లో ఎకరా వరి సాగుకు రూ.50 వేలు ఖర్చవుతోంది. సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని లెక్కగట్టినా, క్వింటా ఉత్పత్తికి రూ.2500 ఖర్చవుతోంది. కేంద్రం తాజాగా నిర్ణయించిన ధర ప్రకారం చూసినా రైతుకు క్వింటాకు రూ.317 నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర మొత్తం రైతుకు దక్కిందని లెక్కించినా ఎకరా వరి సాగులో రూ.6340 నష్టం వాటిల్లుతోంది. అయితే కోతలు లేకుండా ఏ రైతుకు కూడా మద్దతు ధర దక్కడం లేదు. ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అనుకున్నా, తేమ, నూక పేరుతో క్వింటాకు రూ.300 వరకు కోత వేస్తున్నారు. దీంతో రైతులు ఎకరాకు కనిష్ఠంగా మరో రూ.6000 నష్టపోతున్నారు. మొత్తం మీద వరి సాగు రైతుకు ఎకరాకు రూ.12340 నష్టం వాటిల్లుతోంది.
*నిపుణుల సలహాలను పెడచెవిన పెడుతున్నారు
పంటల సాగు ఖర్చులను లెక్కించి మద్దతు ధరలు ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2000 నుంచి 2017 మధ్య మద్దతు ధరలు శాస్త్రీయంగా లెక్కగట్టక పోవడంతో రైతులు అక్షరాలా ఏడేళ్లలో రూ.45 లక్షల కోట్లు నష్టపోయారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వరి పంటకు మద్దతు ధర కేవలం 6 శాతం మంది రైతులకే దక్కుతోందని శాంతకుమార్ కమిటీ నిగ్గుతేల్చింది. మద్దతు ధర రూపొందించేప్పుడు భూమి ధర, కౌలు ధరలు కూడా పరిగణనలోకి తీసుకుని సాగు ఖర్చుకు అదనంగా 50 శాతం మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
*కాడె దించే ప్రమాదం
దేశంలో వరి సాగు సంక్షోభంలో పడింది. గడచిన పదేళ్లలో ఎరువుల ధరలు 400 శాతం పెరిగిపోవడంతోపాటు, వరి సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. అందుకే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రాగా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఖరీఫ్ లో వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇక నాగార్జున సాగర్ ఆయకట్టులో వరి సాగు చేసే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. గతంలో ఎకరాకు 12 బస్తాలు కౌలు ఇచ్చి సాగు చేసిన రైతులు ప్రస్తుతం ఎకరాకు 3 బస్తాలు ఇచ్చి, వరి సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. వరి సాగు చేస్తే కనీసం వరి గడ్డి కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మరింత మంది రైతులు కాడి పడేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశ ఆహార భద్రతకే పెను విపత్తు వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పుడు పాలకులకు కూడా తిండిగింజలు లభించకపోవచ్చు.