రాజకీయ మేధావి శ్రీ వెంకయ్య నాయుడు

విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట కలుగుతుంది’ – ఈ మాటలు చాలు ఆయన గురించి మనం అర్థం చేసుకోవడానికి.. ఆయనే తెలుగుతనం మూర్తీభవించిన రాజకీయ బాటసారి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విశ్లేషించారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ సందర్భాన అధికార వీడ్కోలు సభలో ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ చైతన్య పరుస్తాయి. శ్రీ వెంకయ్య నాయుడు గారిని రాజకీయ బాటసారిగా ఎందుకు అభివర్ణించానంటే.. విద్యార్థి దశలోనే రాజకీయాలలో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించి, ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఎప్పుడూ లేరు. ఆయన రాజకీయ మేధావి. ఇటు శాసనసభ, అటు రాజ్యసభలలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేశాయి. రాజ్యసభ ఛైర్మన్ గా ఆయన సభను నడిపిన తీరు బహుదా ప్రశంసనీయం.
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై శ్రీవెంకయ్య నాయుడు గారికి ఉన్నపట్టు, వాగ్ధాటి ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తాయి. “ఉప రాష్ట్రపతి కంటే ఉషాపతిగా ఉండడమే నాకు ఆనందం” వంటి ఆయన చమత్కారాలు, భాషా విరుపులు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అటు పార్టీ పదవైనా ఇటు రాజ్యాంగ పదవైనా వాటికి వన్నెలు దిద్దడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా.. ఆయన గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. ఆయనను నేను అరుదుగానే కలిసినప్పటికీ కలిసిన ప్రతిసారి ఆయన ఇచ్చే సలహాలు నా రాజకీయ ప్రయాణానికి ఉపయుక్తంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలన్నా, తెలుగు భాషన్నా ఆయనకున్న మక్కువ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రీ వెంకయ్య నాయుడు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారికి గర్వకారణం. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి ప్రజలతో మమేకం కావటానికి సమాయత్తమవుతున్న తరుణంలో శ్రీ వెంకయ్య నాయుడు గార్కి నా హార్దిక శుభాకాంక్షలు. ఆయనకు ఆ భగవంతుడు సుసంపన్నమైన ఆరోగ్యాన్ని,దీర్ఘాయుష్షును, విశ్రాంతి అవసరమవ్వని జీవితాన్ని  ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.