మే 7 నుంచి సమస్యలపై జనసేన సమరభేరి

  • ప్రతీ ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుసుకునేలా కార్యక్రమ ప్రణాళిక
  • క్షేత్రస్థాయిలో ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం
  • జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ళ సురేష్

గుంటూరు, వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నాలుగేళ్లుగా కొనసాగుతున్న అరాచక, దాష్టీక పరిపాలనతో నరకయాతన పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రజల్ని నేరుగా కలుసుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ తెలిపారు. గురువారం నగర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యలపై జనసేన సమరభేరి ప్రతులను విడుదల చేసారు. నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళ పాలనలో బటన్ నొక్కే దగ్గరే ఆగిపోయిందని విమర్శించారు. ఒకవైపు లక్షల కోట్లు అప్పు చేస్తున్నా ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో పాలన కొనసాగడం సిగ్గుచేటన్నారు. నగరంలో పట్టుమని పదినిముషాలు వాన పడితే నగర ప్రధాన రహదారులన్నీ నదుల్లా మారిపోతున్నాయని ధ్వజమెత్తారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థకు ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నగరంలో రహదారుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు అక్రమ మద్యం, గంజాయి విచ్చల విడిగా దొరుకుతుండటంతో నగర యువత మత్తుకి బానిసై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ నగరంలో పాలనంతా అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు. నగర శివారు కాలనీల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని, కనీసం వాళ్ళని పలకరించే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్ధ పాలనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే ప్రజలతో జనసేన పార్టీ నేరుగా కలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, ఆసియా, కళ్ళగంటి త్రిపుర, యాట్ల దుర్గ, పులిగడ్డ నాగేశ్వరరావు, మల్లి, గడ్డం రోశయ్య, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.