భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతి సమీక్షించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సమీక్షించడానికి ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుని వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో 40 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు మోడీ. వ్యాక్సిన్ ప్రయోగ శాలను సందర్శించారు. వ్యాక్సిన్ యొక్క పురోగతిపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ పురోగతిని గురించి ట్వీట్ చేసిన పిఎం నరేంద్ర మోడీ, భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు కోవిడ్ -19 వ్యాక్సిన్ పురోగతి గురించి తనకు వివరించినట్లు చెప్పారు. కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి పరిచే క్రమంలో ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించిన భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తల బృందం ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని పిఎం మోడీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పరీక్షలలో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలను అభినందించారు. వేగవంతమైన పురోగతికి వీలుగా వారి బృందం ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని పిఎం మోడీ ట్విట్టర్లో తెలిపారు.

హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్ సందర్శించిన మోడీ అక్కడ వ్యాక్సిన్ పురోగతిని తెలుసుకున్న తర్వాత తిరిగి పూణే కు పయనమయ్యారు. కాన్వాయ్ లో హకీంపేట కు బయలుదేరిన మోదీ భారత్ బయోటెక్ నుంచి 20 నిమిషాల్లోనే హకీంపేట కు చేరుకున్నారు.