వారాహి తొలి యాత్ర విజయవంతం

• అడుగడుగునా హారతులతో శ్రీ పవన్ కళ్యాణ్ కి మహిళల ఘన స్వాగతం
• దారిపొడుగునా గజమాలలతో ముంచెత్తిన పార్టీ శ్రేణులు
• విజయవాడ – మచిలీపట్నం రహదారిలో ఎటుచూసినా జనప్రవాహం
• వేలాది బైకులు.. వందలాది కార్లతో భారీ ర్యాలీ
• వారాహి తొలి పరుగులో 38 కిలోమీటర్ల ప్రయాణం

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి తొలి అడుగును ఘనంగా ప్రారంభించి.. విజయవంతంగా పూర్తి చేసింది. ఆశేష జనవాహిని జయజయధ్వానాల మధ్య విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నంలో తలపెట్టిన పార్టీ 10వ ఆవిర్భావ సభా ప్రాంగణానికి వారాహి విజయ యాత్రను ప్రారంభించింది. జనసైనికులు, వీర మహిళలు పెద్దఎత్తున వెంట తరలిరాగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారాహిదారుడై పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభకు బయలుదేరారు. వారాహి యాత్ర నేపధ్యంలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ మద్దతుగా రాష్ట్రం నలు మూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. వారాహి యాత్రకు తరలివచ్చిన జనఉప్పెన బెంజి సర్కిల్ – పెనమలూరు మధ్య జాతీయ రహదారిని ముంచెత్తింది. సుమారు 8 కిలోమీటర్ల మేర ఇసుక వేస్తే రాలనంతగా రహదారి నిండిపోయింది. వీర మహిళలు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా విజయవాడ ఆటోనగర్ గేట్ వద్ద నుంచి వారాహి యాత్ర ప్రారంభమయ్యింది. వేలాది బైకులు, వందలాది కార్లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారిని ముంచెత్తడంతో వారాహి విజయవాడ శివార్లకు చేరుకోవడానికే 3 గంటల సమయం పట్టింది. ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు సెంటర్లలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ శ్రేణులు భారీ గజమాలలతో స్వాగతం పలికారు. 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు చుట్టు పక్కల ఉన్న అపార్ట్ మెంట్లు, భవనాలు, ఎత్తైన ప్రదేశాలన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు వచ్చిన జనసందోహంతో నిండిపోయాయి.
వేడిగాలులను సైతం లెక్క చేయకుండా తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కొంత మంది జనసైనికులు స్థంభాల మీదకు ఎక్కి వారాహిపై ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెయ్యి ఇచ్చేందుకు ప్రయత్నించగా, తన చేతితో తాకి ఉత్సాహ పరిచారు. ప్రతి సభలో ముందు దేశం తర్వాతే పార్టీ అని చెప్పే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇచ్చిన జాతీయ జెండాని పలు మార్లు చేతబూని తన దేశభక్తిని చాటుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు మద్దతుగా తరలివచ్చిన దళిత సోదరుల కోరిక మేరకు నీలి జెండా రెపరెపలాడించి జై భీమ్ అంటూ నినదించారు. జాతీయ పతాకం, నీలి జెండా తర్వాత పార్టీ జెండా చేతబూని అభిమానుల్ని ఉత్సాహ పరిచారు. ఆటో నగర్ నుంచి దారి పొడుగునా అభిమానులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పూల వర్షం కురిపించగా ఆ అభిమాన సంద్రంలో తడిసి ముద్దయ్యారు.
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథానికి పవిత్ర వారాహి మాత నామకరణం చేసిన నేపధ్యంలో దారి పొడుగునా వీర మహిళలు వారాహికి హారతులు పట్టగా, పార్టీ శ్రేణులు వారాహి స్పృశిస్తూ తరించారు. చాలా మంది వారాహిని ముట్టుకుని నమస్కరించడం కనబడింది. వారాహి యాత్ర సాగినంత దూరం రహదారికి ఇరు వైపులా మహిళలు హారతులు చేతబూని నిలబడ్డారు. పలువురు మేళతాళాలు, బాణసంచ పేలుళ్లతో వారాహి దారుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలికారు. ఆటో నగర్ నుంచి కొంత దూరం గబ్బర్ సింగ్ బ్యాచ్ వారాహి ముందు నడుస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచింది.
• వారాహి దిగి కారు ఎక్కి…
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారాహి మీద సభా స్థలికి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కోసం వచ్చిన జనప్రవాహం మధ్య సుమారు 38 కిలోమీటర్లు 5 గంటల పాటు ప్రయాణించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న వేలాది వాహనాలను నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడం, సభకు ఆలస్యం కావడంతో జాతీయ రహదారి 65పై ఉన్న దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత వారాహి నుంచి దిగి కారు ఎక్కారు. అదే కారులో సభా స్థలికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పామర్రు, గూడూరుల్లో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్డుపై వేచి ఉండడంతో కారు పై నుంచి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వారాహి యాత్ర ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ, వారాహి యాత్ర నేపధ్యంలో విజయవాడ – మచిలీపట్నం మధ్య 65వ నంబర్ జాతీయ రహదారి మొత్తం జనసేన జెండాలు, ఆహ్వానం పలుకుతూ వెలసిన భారీ హోర్డింగులు, స్వాగత తోరణాలతో నిండిపోయింది.