ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకీ వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం

• సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన కన్సాలిడేట్ ఫండ్ లో నిధులు ఏం చేశారు?
• కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
• అధికారం కోసం ఎంతకైనా తెగించే మానసిక రోగి జగన్
• తనపై కోడి కత్తి దాడి చేయించుకున్న వ్యక్తి అతను
• అందరికీ కనిపించే అవినీతిపరుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
• రాష్ట్రం కోసం 2014 నాటి కూటమి మళ్లీ కలవాలన్నదే నా ఆకాంక్ష
• జగన్ రెడ్డిపై కేంద్రానికి ప్రత్యేక ప్రేమ లేదు
• జీ-20 సదస్సులో బీజేపీ పెద్దలు ఉండబట్టే పొత్తు నిర్ణయం కేంద్ర పెద్దలకు ముందుగా చెప్పలేకపోయాను
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను అడగడంపై వైసీపీ నేతల మౌనం
• వచ్చే ఎన్నికల్లో మాతో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం ఉంది
• జనసేన పార్టీ పొత్తు సమన్వయ కమిటీ సభ్యుల నియామకం
• మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘రాష్ట్రంలోని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ అత్యున్నత ఉద్యోగుల నుంచి సాధారణ కాంట్రాక్టు ఉద్యోగుల వరకు సకాలంలో జీతాలు అందని పరిస్థితి వచ్చేసింది. ఢిల్లీ వెళ్లి దేహీ అంటే తప్ప ప్రతి నెలా వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం కనిపిస్తోంది. రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడిన వారిపై దాడులు, గట్టిగా అడిగితే దేశద్రోహం కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమి లేదు. రాష్ట్రానికి ఏవైనా సమస్యలు ఉంటే ఓ ప్రతికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు సమాధానం చెప్పేందుకు కూడా ముఖ్యమంత్రికి తీరిక లేద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఐఏఎస్ అధికారులు 206 మంది, ఐపీఎస్ అధికారులు 130 మంది, ఐఎఫ్ఎస్ అధికారులు 50 మంది ఉన్నారు. వీరికి కన్సాలిడేట్ ఫండ్ నుంచి ప్రతి నెలా వేతనాలు అందుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్స్ అధికారులకు సకాలంలో జీతాలు అందడం లేదు. 20 రోజులకు కూడా వారి నెల వేతనం పడని పరిస్థితి ఉంది. అలాగే విశ్రాంత సివిల్ సర్వీస్ అధికారులకు పింఛను కూడా సమయానికి రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల వేదన అనంతం అని చెప్పాలి. నెలల తరబడి వారికి వేతనాలు అందక చితికిపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక సతమతం అవుతున్నారు. నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లా, ఆదోనిలో సర్వ శిక్షా అభియాన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీ రమణ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. గత 4 నెలలుగా జీతం రాకపోవడంతో ఇంటి అద్దె చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు భారమై వేదన చెంది, ఇంటి యజమాని గట్టిగా అడగడంతో ఆత్మగౌరవం చంపుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక్క రమణ సమస్యే కాదు.. రాష్ట్రంలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య. మచిలీపట్నం జనవాణిలోనూ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు నా వద్దకు వచ్చి వేతనాలు రావడం లేదని మొర పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా రమణ ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీతాల సొమ్ములను సైతం అడ్డగోలుగా మళ్లిస్తూ, రాజ్యాంగ విరుద్ధమైన పనులకు వైసీపీ పేటెంట్ తీసుకున్నట్లు వ్యవహరిస్తోంది. రాజ్యాంగ అసంబద్ధ పనులు మా జన్మహక్కు అన్నట్లు వైసీపీ నేతల ప్రవర్తిస్తున్నారు.
• మా పార్టీ గురించి కాదు… రాష్ట్ర క్షేమం గురించి ఆలోచించండి
జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి… ఎక్కడ పోటీ చేయాలి.. ఎన్ని స్థానాల్లో బరిలో నిలవాలో తేల్చుకోవాలని వైసీపీ నేతలు మా గురించి మాట్లాడే కంటే ముందు రాష్ట్ర క్షేమం గురించి మాట్లాడాలి. ఢిల్లీ వెళ్తున్న వైసీపీ నాయకుడు కేంద్ర పెద్దలతో రాష్ట్ర సమస్యల గురించి చర్చించాలి. తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతంలో పసుపు అధికంగా పండుతుంది. ఆ ప్రాంతంలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి, ఇటీవల ప్రధాని శ్రీ మోదీ గారితో దానికి ప్రకటన చేయించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కొబ్బరి, జీడి పండే ప్రాంతాల్లో ఆయా బోర్డుల ఏర్పాటుపై ఢిల్లీకి వెళ్ళిన సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడాలి. విభజన సమస్యల గురించి మాట్లాడాలి. రాష్ట్రం నుంచి ఉన్న 30 మంది వైసీపీ ఎంపీలు టీలు, కాఫీలు తాగడానికి వెళ్తున్నారా..? లేక వారిపై ఉన్న కేసుల గురించి కేంద్ర పెద్దలతో చర్చించడానికి వెళ్తున్నారా..? వైసీపీకి మా గురించి కాకుండా రాష్ట్రం గురించి ఆలోచించడానికి ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారనే విషయం ఆ పార్టీ నేతలు మర్చిపోయారు.
• 2104 కూటమి మళ్లీ కలవాలన్నదే మా ఆశ
తెలంగాణ రాష్ట్రం రావడం సంతోషించాల్సిన విషయమే అయినా, రాష్ట్రం విభజన జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు. 2014లో శ్రీ కొనకళ్ల నారాయణ లాంటి వారిపై పార్లమెంటులో దాడి చేసి, ఆంధ్ర ప్రాంత ఎంపీలను భయబ్రాంతులను చేసి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. ఇదే విషయాన్ని నూతన పార్లమెంటు భవనం ప్రారంభ ప్రసంగంలోనూ ప్రధాని శ్రీ మోదీ ప్రస్తావించారు. 2014లో విభజిత రాష్ట్ర సుస్థిరత కోసం అప్పటి బీజేపీ, తెలుగుదేశం కూటమికి ఎన్నికల్లో మద్దతు తెలిపాం. కచ్చితంగా దశాబ్ద కాలంలో రాష్ట్రం మంచి దిశకు వెళ్తుందని భావించాం. ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్టీయేలోనే కొనసాగుతుంది. ఇటీవల ఎన్టీయే కూటమి సమావేశానికి హాజరయ్యాను. మళ్లీ 2014లో రాష్ట్రం కోసం పనిచేసిన కూటమి 2024లోనూ పని చేయాలనేది మా ఆకాంక్ష. రాష్ట్ర శ్రేయస్సు కోసం మళ్లీ మూడు పక్షాలు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. 2021లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పిన దగ్గర నుంచి నాది ఇదే ఆకాంక్ష. కేంద్ర పెద్దలను పలుమార్లు కలిసి ఇదే విషయాన్ని వారికి విన్నవించాను. అభివృద్ధి దూరమై, అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అత్యున్నతంగా తీర్చిదిద్దాలంటే మూడు పక్షాలు కలిసి పోరాడాలని కోరాను.
• కేంద్ర పెద్దలు జీ-20లో ఉండగా శ్రీ చంద్రబాబుని అరెస్టు చేశారు
జీ-20 సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ అతి తెలివి వల్ల పొత్తు నిర్ణయాన్ని రాజమండ్రిలో శ్రీ చంద్రబాబు గారిని కలిసిన తర్వాత చెప్పాల్సి వచ్చింది. కావాలనే జీ-20 సదస్సు జరుగుతున్న సమయంలో, జీ-20 సదస్సులో కేంద్ర పెద్దలంతా బిజీగా ఉన్న సమయంలో చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజమండ్రిలో శ్రీ చంద్రబాబు గారిని కలిసి పరామర్శించాను. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా శ్రీ లోకేశ్, శ్రీ బాలకృష్ణ గార్లతో కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు నిర్ణయం ప్రకటించాను. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి, రాష్ట్రంలో జరిగిన విషయం మొత్తం చెప్పిన తర్వాతే పొత్తు నిర్ణయాన్ని బీజేపీ పెద్దల ఆమోదంతోనే చెప్పాలని భావించాను. అయితే జీ-20 సదస్సులో బీజేపీ పెద్దలు ఉండిపోవడంతో నేను వారికి వైసీపీ చేస్తున్న దాష్టీకాన్ని వివరించే అవకాశం లేకపోయింది. దీంతో రాజమండ్రిలో పొత్తు నిర్ణయాన్ని వెలువరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటు చీలనివ్వను అనే మాటకు ఇప్పటికీ కట్టబడి ఉన్నాను. కచ్చితంగా బీజేపీ పెద్దలు రాష్ట్రం కోసం సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను.
• సమన్వయ కమిటీ సభ్యుల నియామకం
గతంలోనే మిత్రపక్షంగా ఉన్న జనసేన-బీజేపీ పార్టీల సమన్వయ కమిటీ ఉంది. అది ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ ఉండాలని నిర్ణయించాం. వైసీపీ ప్రభుత్వ విధానాలపై, రాజకీయ పరిణామాలపై ఓ సంయుక్త కమిటీ ఉండాలని భావిస్తున్నాం. దీనిలో భాగంగా జనసేన పార్టీ నుంచి సమన్వయ కమిటీ ఛైర్మన్ గా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరిస్తారు. పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బి.మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ పాలవలస యశస్వి, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ సభ్యులుగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా త్వరలోనే సమన్వయ కమిటీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాను. రెండు పార్టీల సమన్వయంతో కార్యక్రమాల నిర్వహణ, పోరాట బాధ్యతలు, ఇతర రాజకీయ ప్రకటనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే మాకు మొదటి ప్రాధాన్యం. వారి శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రధాని శ్రీ మోదీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభ ప్రసంగంలోనూ శ్రీ మోదీ గారు ఇదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసి వస్తారనే నమ్మకం ఇప్పటికీ ఉంది. ప్రజల్లో స్పందన చూస్తుంటే కచ్చితంగా వారికి జనసేన-తెలుగుదేశం కూటమిపై ఓ భరోసా ఏర్పడింది. గతంలో జనసేన పార్టీకి బలమైన ప్రజా స్పందన ఉన్నప్పటికీ అధికారంలోకి వస్తుందా అనే అనిశ్చితి ఉండేది. తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తర్వాత, జగన్ అనే వ్యక్తిని ఇంటికి పంపే బలమైన కూటమి ఏర్పడిందని భావిస్తున్నారు.
• ఇక్కడ ఆలయాలు కూల్చి ఢిల్లీ వెళ్ళి విగ్రహాలు ఇస్తాడు
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నికయిన ప్రభుత్వానికి, నాయకుడికి కచ్చితంగా కేంద్రం తగిన గౌరవం ఇవ్వాలి. కేంద్ర పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చూపిస్తున్న అభిమానం ఇలాంటి కోవలోకే వస్తుంది. రాష్ట్రంలో ఆలయాలు కూల్చినా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాలు ఇవ్వడం జగన్ కే చెల్లుతుంది. అంత మాత్రాన జగన్ అంటే కేంద్ర పెద్దలకు ప్రత్యేక ప్రేమ, అభిమానం ఉంటుందని నేను అనుకోను. అలాగే రాష్ట్రానికి ఇటీవల కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు వచ్చిన విషయం మీద కేంద్ర పెద్దలు చెప్పిందే ఏమిటంటే… రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండిపోయిన నిధులను సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల చేసినట్లు చెప్పారు. మనకు బయటకు కనిపించేది ఒకలా ఉంటే, లోపల జరిగేది మరోలా జరుగుతోంది. జగన్ చేసే దాష్టీకాలు కేంద్రానికి తెలియనివి కావు. అలాంటి వ్యక్తిని బీజేపీ పెద్దలు అభిమానిస్తారు అని అనుకోను. జగన్ మీద ఉన్న కేసులన్నీ కేంద్రం తీసేసి ఆయనకు పూర్తిగా క్లీన్ చీట్ ఇస్తే అప్పుడు ఏమైనా కేంద్ర వైఖరి మీద అనుమానపడొచ్చు. అదేమీ లేదు. సీబీఐ కేసులు ముఖ్యమంత్రి మీద మరింత బిగుసుకుంటున్నాయి. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వెనుక ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారంటే కేంద్రం ఎక్కడా రాజీ పడలేదని అర్ధం అవుతోంది. కచ్చితంగా తెలంగాణలో మేం పోటీ చేస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం 40 మంది కార్పొరేటర్ అభ్యర్థులను విత్ డ్రా చేయించాం. అప్పటి పరిస్థితి బట్టి అలా జరిగింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బలంగా పోటీ చేస్తాం. అలాగే కేంద్రం కూడా వైసీపీని దగ్గరికి తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఫ్లోర్ మేనేజ్ మెంటులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారు కీలకమైన బిల్లలను ఆమోదించుకోవాలంటే కచ్చితంగా కొన్ని పార్టీల మద్దతు తీసుకోక తప్పదు. అయితే దానికి ప్రతిగా వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత విషయాలపై లబ్ధి పొందుతున్నారు. విశాఖ స్టీల్ గురించి మాట్లాడరు.. సొంత గనులు కావాలని అడగరు. కేవలం వారి కేసులు, వ్యాపారాల గురించి మాత్రమే కేంద్రంతో ఈ సయోధ్యను వారు వాడుకుంటారు.
• ఆస్తుల పంపకం జరగాలి
నీళ్లు, నియామకాలు, నిధులు అనే ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడింది. ఉమ్మడి ఆస్తులు రూ.1.50 లక్షల కోట్ల పంపకం చేయాలి. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనే నినాదం జగన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే గ్లోబలైజేషన్ కారణంగా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని, దీనివల్ల స్థానికుల్లో భావోద్వేగం ఏర్పడుతుందని, దాన్ని ఓట్ల రూపంలో మరల్చుకోవచ్చని జగన్ అనుకున్నారు. దేశ విభజన జరిగినపుడు సాధారణ ఫర్నీచర్ తో సహా నాయకులు విభజించారు. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం కావొస్తున్నా, ఇప్పటికీ ఆస్తుల పంపకం జరగలేదు. ఇది కచ్చితంగా రాష్ట్ర నాయకుల తప్పే. రాష్ట్ర నాయకులు వారి ఆస్తుల కోసం, కేసుల కోసం మాట్లాడతారే తప్ప.. రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల పంపకం మీద దృష్టి పెట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో జనసేన పోటీ చేయడానికి కూడా కారణం ఏమిటంటే ఆంధ్రా అభివృద్ధి చెందితేనే, కచ్చితంగా తెలంగాణ కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి బాట పడుతుందనే నమ్మకమే.
• శాడిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తి
అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు. ఏమైనా చేస్తాడు. గత ఎన్నికల ముందు కోడి కత్తితో పొడిపించుకొని, సింపతీ కోసం ప్రయత్నించిన ఓ మానసిక రోగి. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మీద జరిగిన దాడిని నేను కూడా ఖండించాను. నాకు ఎక్కడో ఓ మూల అనుమానం ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులను బట్టి ఘటనపై చింతించాను. సొంత బాబాయి బాత్రూంలో హత్యకు గురైతే, గుండెపోటు అని ప్రచారం చేసిన వ్యక్తులు వారు. ఏదో ఒక విషయం దాచేయాలనే శాడిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తి. 30 కేసులున్న వ్యక్తికి ఇంత కంటే గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి..? అందరికీ కనిపిస్తున్న అవినీతిపరుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే.
• సినిమా పరిశ్రమ వారిని వైసీపీ బెదిరిస్తోంది
సినిమా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ మొదలైనపుడు కానీ, 1983లో తెలుగుదేశం పార్టీ ప్రారంభం అయినప్పుడు కానీ సినిమా రంగంలోని వారంతా ఒకేతాటిపైకి వచ్చి మద్దతు తెలపలేదు. 24 క్రాఫ్ట్స్ లో పని చేసే వారికి ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉంటాయి. ప్రస్తుతం సినిమా పరిశ్రమలోని వారు బయటకు వచ్చి వారి అభిప్రాయాలు చెప్పాలన్నా వైసీపీ బెదిరించే పరిస్థితి ఉంది. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ అభిప్రాయాలను బయటకు చెబితే సూపర్ స్టార్ శ్రీ రజనీకాంత్ వంటి వారిని కూడా వైసీపీ నాయకులు అనరాని మాటలు అన్నారు. వారికి వీరు వారు అన్న తేడా లేదు’’ అని అన్నారు.
• వారాహి యాత్ర విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు రోజులపాటు జరిగిన వారాహి విజయ యాత్ర గొప్ప ప్రజాదరణతో సాగింది. ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను ఎండగడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాలు క్షేత్రస్థాయిలో ఎంతోమందిని ఆలోచింపజేశాయి. ముఖ్యంగా తొలి రోజు అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో డీఎస్సీ అభ్యర్థులు సభకు వచ్చి తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. సభా వేదిక నుంచే జనసేన- తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి డీఎస్సీ అభ్యర్ధులకు అండగా ఉంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. రెండవ రోజు గాంధీ జయంతి వేడుకలు మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించాం. అదే రోజు సాయంత్రం గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. మూడో రోజు మలిచీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో దాదాపు 200పైగా అర్జీలు వచ్చాయి. హిందు కళాశాల భూములు అన్యాక్రాంతం, సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ పీఈటీలు, చేనేత కళాకారుల ఆత్మహత్యలు, ఖబరస్థాన్ కోసం ముస్లిం సోదరులు పడుతున్న ఇబ్బందులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల అవస్థలు, సాగు నీరు అందక రైతులు పడుతున్న కష్టాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. నాలుగో రోజు పెడనలో జరిగిన బహిరంగ సభలో జగన్ రూపాయి పావలా పథకాలు గురించి, యువత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు జనసైనికుల మీద పెట్టిన అక్రమ కేసుల గురించి ప్రసంగించారు. చివరి రోజు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆక్వారంగాన్ని ఆదుకోవడం, కొల్లేరు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలను చతుర్ముఖ నగరాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగో విడత వారాహి విజయ యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, నిస్వార్థంగా పనిచేసిన జనసైనికులు, వీర మహిళలకు పార్టీ, అధ్యక్షుల వారి తరఫున ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది” అని అన్నారు.