పట్టాదారు పాసుపుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు?
•ప్రభుత్వ చర్యలతో రైతుల్లో అనుమానాలు… ఆందోళన
•ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తోంది
•కౌలు రైతుల హక్కులను వైసీపీ కాలరాస్తోంది
•తుపానుతో నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు
•18న సత్తెనపల్లిలో రైతు భరోసా యాత్ర సభ
•తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు భరోసా లేకుండా చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏడాదికో పాలసీ తెచ్చి ప్రణాళికాబద్దంగా రైతులకు నష్టం చేస్తోందన్నారు. కొత్త చట్టంతో కౌలు రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు జనసేన పార్టీ అండగా నిలుస్తోందన్నారు. కౌలు రైతు కుటుంబాలకు బాసటగా నిలిచే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 18వ తేదీన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి సుమారు 300 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందించనున్నట్టు చెప్పారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని ధైర్యం నింపారు. గురువారం సాయంత్రం తెనాలిలో మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లిలో నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను జిల్లా నాయకులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల కష్టాలు పెరిగిపోయాయి. వారికి రావాల్సిన సబ్సిడీలు రావడం లేదు. ఆపద సమయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదు. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉన్న కౌలుదారు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చి రైతుల్ని నిలువునా ముంచారు. గతంలో గ్రామ సభలో తీర్మానం చేస్తే కౌలు రైతుకి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సబ్సిడీలు అందేవి. విత్తనం నుంచి బ్యాంకు రుణాల వరకు అన్నీ వచ్చేవి. ఆ చట్టాలు మార్చేసి కౌలు రైతుకు ఈ ప్రభుత్వం ఎలాంటి హక్కు లేకుండా చేసింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకుండా చేసింది.
•రైతు ఫోటో చిన్నది.. సీఎం ఫోటో పెద్దదా
మరోవైపు రైతుల సొంత పొలాలకు ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని పాసు పుస్తకాలు ఇస్తున్నారు. భూమి రైతుది ఫోటో సీఎంది. భూమి గల రైతు ఫోటో చిన్నది వేసి సీఎం ఫోటో పెద్దది వేశారు. అది ప్రభుత్వ ఆస్తి కాదు.. సీఎం ఆస్తి కాదు రైతులకు వారి తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. ఇది రైతుల్ని అవమానించడమే. చాలా మంది రైతులు ఈ ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. అసలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని ప్రశ్నిస్తునారు. కాలువలకు, రోడ్లకు మరమ్మతులు చేయలేరుగాని ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగానే చేస్తారు. ఇలాంటి చర్యలు విరమించుకోవడం మంచిది.
•సీఎం సొంత నియోజకవర్గానికే భరోసా లేదు
శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందుగా స్పందించి రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు దాతలుగా నిలబడ్డారు. పార్టీతో కలసి నడిచారు. కౌలు రైతు భరోసా యాత్ర మొదలు పెట్టి ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో పూర్తి చేశాం. ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 46 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నాయకత్వం వహించాల్సిన తీరు ఇది కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సొంత నియోజకవర్గంలో ప్రజలకు భరోసా ఉంటుంది. ఆ పరిస్థితి ఈ సీఎం గారి దగ్గర ఎక్కడా కనబడలేదు.
•అన్నపూర్ణగా పేరున్న గుంటూరు జిల్లాలోనూ రైతులు చితికిపోయారు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి నియోజకవర్గంలో సభ నిర్వహించనున్నాం. అన్నపూర్ణగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలో రైతాంగం చితికిపోయింది. మూడు నెలలుగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి కౌలు రైతుల ఆత్మహత్యలపై కసరత్తు నిర్వహించాం. రైతు స్వరాజ్య వేదిక అనే ఎన్జీవోతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్టుమార్టం కాపీలతో సహా సేకరించాం. జిల్లావ్యాప్తంగా మాకు వచ్చిన లెక్క 281 మంది కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా బాధాకరం. అన్నపూర్ణ లాంటి జిల్లాలో ఇది ఊహించని పరిస్థితి. గతంలో గుంటూరు జిల్లా రైతులు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి ఎంతో పేరు సంపాదించారు. ఆ పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితికి దిగజారిపోవడం బాధ కలిగించింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. మిర్చి, పత్తి రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేని పరిస్థితుల్లో భవిష్యత్తు మీద ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఆరుగురు ప్రాణాలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకి మరో నాలుగు చొప్పున వినతిపత్రాలు పార్టీ దృష్టికి వస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి జనసేన కార్యకర్త, జిల్లా రైతాంగం మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని కోరుతున్నాం.
•తుపాను నష్టం అంచనాకు రేపు తెనాలిలో క్షేత్ర స్థాయి పర్యటన
తుపాను కారణంగా తెనాలి, కొల్లిపర మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం రాష్ట్రంలో అతి పెద్ద స్కాం రైతు భరోసా కేంద్రాలే. రూ. 6300 కోట్లు ఖర్చు చేసి భవనాలు నిర్మించామని కాకి లెక్కలు చెప్పారు. ఆ మొత్తం ఏదో రైతుల కోసం ఉపయోగించి ఉంటే బాగుండేది. ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా రైతులకు నష్టం చేస్తోంది. రోజుకో కొత్త పాలసీ తెస్తూ ఇబ్బంది పెడుతోంది. తెనాలి, కొల్లిపర మండలాల్లో ఇప్పటి వరకు 900 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. 7 లక్షల 75 వేల క్వింటాళ్లకు 900 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. అది కూడా ఎన్నో ఆంక్షల నడుమ. ముందుగా బస్తాలు లేవన్నారు. తర్వాత తేమ అన్నారు. ఇప్పుడు కనీస మద్దతు ధర గురించి మాట్లాడడం లేదు. దళారులు రూ. 1250కి కొనుగోలు చేసి దాన్ని రైతు భరోసా కేంద్రాల్లో రాయించుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో బస్తాకు రూ. 50-రూ. 100 వరకు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఆ మొత్తం ఎవరి కోసం? శుక్రవారం తెనాలి, కొల్లిపర మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటాం. క్షేత్ర స్థాయి అధ్యయనం తర్వాత సత్తెనపల్లి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతు సమస్యల మీద ప్రసంగిస్తారు.
•ప్రభుత్వం దిగి రావాలి
రైతు సమస్యలపై ప్రభుత్వం దిగిరావాలి. ఇచ్చిన హామీ మేరకు ప్రతి గింజా కొనుగోలు చేయాలి. తేమ శాతం, రంగుతో సంబంధం లేకుండా కొనే ఏర్పాటు చేయాలి. రైతాంగాన్ని పార్టీలు, కులాల వారీగా విభజించి చూడొద్దు. కొంత మందికే అవకాశం కల్పించడం అన్యాయం. ప్రతి రైతుని ఆదుకోవాలి.. నిలబడాలి.. ఇచ్చిన హామీ మేరకు డబ్బు వారి అకౌంట్లలో వేయాలి. గత ఏడాది 8 నెలలు గడచినా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ వరి రైతులకు రూ. 320 కోట్లు బకాయిలు ఉన్నారు. ఈసారి ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో వారం రోజుల్లో రైతులకు ఖాతాల్లో డబ్బు పడే ఏర్పాటు చేయాలి. ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దు. జనసేన అండగా ఉంటుంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, కళ్యాణం శివశ్రీనివాస్, నయూబ్ కమాల్, అమ్మిశెట్టి వాసు, విజయ్ శేఖర్, బండారు రవికాంత్, నేరెళ్ల సురేష్, ఇస్మాయిల్ బేగ్, ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు.