రెల్లిలకు యావత్ సమాజం రుణపడి ఉంటుంది

  • కార్మికుల కష్టాలపై అవగాహన ఉంది
  • కార్మికులకు అండగా ఉంటాను
  • కార్మికులు దేవుళ్ళతో సమానం
  • టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు: సూర్యోదయం కాకముందే విధుల్లో చేరి ప్రజలు విసర్జించిన మాలమూత్రాలను, చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులకు, రెల్లి సామాజిక వర్గానికి యావత్ సమాజం రుణపడి ఉంటుందని ఉమ్మడి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం రెల్లి రాష్ట్ర యువనేత సోమి ఉదయ్ కుమార్, రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావులు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఐదేళ్లలో నెరవేర్చలేదని విమర్శించారు. కార్మికుల కష్టాలపై, సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు మాట్లాడుతూ రెల్లి కులాన్ని తాను స్వీకరిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించటం మా ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసిందన్నారు. జనసేనాని పిలుపుమేరకు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లిలు కృషి చేస్తున్నామని శంకరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నాజర్ వలి, నాదెండ్ల రాము, సాయి, పులిగడ్డ గోపి, నాయక్, మిద్దె నాగరాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.