మూడుసార్లు ఇసుక విధానాన్ని మార్చి… ప్రజల్ని ముప్పేట ముంచిన వైసీపీ ప్రభుత్వం
*భవన నిర్మాణ కార్మికుల వెతలు వింటే గుండె తరుక్కుపోయింది
* రాష్ట్రంలో ఇసుక దందాను అరికట్ట లేకపోయిన వైసీపీ ప్రభుత్వం
* తెనాలి నియోజకవర్గంలో ఘనంగా శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
* ప్రజోపయోగ, సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘రాష్ట్రంలో ఇసుక దందా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. జగనన్న కాలనీల్లో పేదలు ఇల్లు కట్టుకునే సమయంలో ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకకు కూడా రకరకాల ఛార్జీల పేరుతో డబ్బు గుంజుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడుసార్లు ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఆ విధానం వల్ల పేదలకు, అలాగే భవన నిర్మాణ కార్మికులకు మేలు జరగాల్సింది పోయి కొత్త కష్టాలు వచ్చాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వారు చెప్పిన వేదన నన్ను కదిలించింది. కూలి పనులను నమ్ముకున్న భవన నిర్మాణ కార్మికులకు వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే పని ఉంటోంది. ఇప్పటికీ సరిగ్గా ఇసుక దొరక్క వారికి జీవన భృతి కూడా కష్టమవుతోంద’ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీ మనోహర్ గారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “క్షేత్ర స్థాయిలో ఇసుక కొరత చాలా దారుణంగా ఉంది. నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టిన కంపెనీ కాకుండా క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బహిరంగంగా ఈ దందా సాగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజలకు ఏ విధానం మేలు చేస్తుంది.. వారిని ఎలా ఆదుకోవాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలు ఆశయానికి అనుగుణంగా ఆయన జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. జన్మదినం కేవలం కేకులు కోసి పండగలా కాకుండా, ఒక అంకితభావంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించుకోవడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం. ఏ పరిస్థితిలో అయినా ప్రజలకు పార్టీ పరంగా మంచి చేయాలి అన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. దానికి అనుగుణంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలను జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు క్రమశిక్షణతో నిర్వహించారు. ఇదే ఐకమత్యంతో, స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందిస్తుంది’ అన్నారు.
* తెనాలిలో అంబరమంటిన జన్మదిన వేడుకలు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పార్టీ ముందుగా నిర్దేశించుకున్న మేరకు సామాజిక కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ముగింపు అనంతరం శ్రీ మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా తెనాలి ఆర్.ఆర్. నగర్ లోని బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీ మనోహర్ గారు పాల్గొని విద్యార్థులకు అవసరమైన స్టేషనరీని అందించారు. విద్యార్థులతో ముచ్చటించి బాగా చదువుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్తపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహం సందర్శనకు వెళ్లి అక్కడ పిల్లలతో ముచ్చటించారు. వారికి అవసరమైన పుస్తకాలు అలాగే జామెంట్రీ బాక్స్ లను అందజేశారు. అనంతరం అత్తోట నుంచి వచ్చిన వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలోని 4, 9 వార్డుల్లో ఉన్న రెల్లి కాలనీలను సందర్శించి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రెల్లి సోదరులతో మాట్లాడి వారి సాధక బాధకాలను విన్నారు. జీవన పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగో వార్డులో ఇటీవల మృతి చెందిన మున్సిపాలిటీ కార్మికుడి ఇంటికి శ్రీ మనోహర్ గారు వెళ్లారు. కార్మికుడి మృతికి సంబంధించి ఎలాంటి పరిహారం అందలేదని, దీనిపై అధికారులు కూడా మాట దాటవేస్తున్నారని కుటుంబ సభ్యులు శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకురావడంతో దానిపై అధికారులతో మాట్లాడతానని, తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రెల్లి కాలనీల్లో అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని, తమ సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆయా కాలనీలో స్థానికులు మనోహర్ కి సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం తెనాలి శివాజీ సెంటర్లో జనసేన నాయకులు పళ్లెం మురళి ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో మనోహర్ పాల్గొని శ్రీ పవన్ కళ్యాణ్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుట్టా రాఘవరావు రైస్ మిల్ సెంటర్ లో జనసేన పార్టీ నాయకులు హరిదాసు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకల్లో శ్రీ మనోహర్ గారు పాల్గొని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు. పిల్లలకు స్కూల్ బ్యాగులను అందజేశారు. సోమ సుందరపాలెంలో జనసైనికులు ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు. కఠెవరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి, అక్కడే కేక్ కోసి జన సైనికులకు తినిపించారు. జనసేన నాయకులు తాటి పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదే గ్రామంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పేదలకు చీరలను పంపిణీ చేశారు. చివరిగా తెనాలి నియోజకవర్గంలో అంగలకుదురులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమణారావు, జనసేన నాయకులు పసుపులేటి మురళీకృష్ణ, హరిదాసు గౌరీ శంకర్, షేక్ జాకీర్ హుస్సేన్, వల్లెం మురళి, ఎంపీటీసీ వెంకట నరసమ్మ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.