స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనసైనికులు

• గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రికార్డు స్థాయిలో 405 యూనిట్ల రక్తదానం
• ఘనంగా జనసేన రక్తదాన శిబిరం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన శిబిరం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కి రికార్డు స్థాయిలో 405 యూనిట్ల రక్తాన్ని పార్టీ తరఫున అందచేశారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన సమాజానికి ఏదైనా చేయాలన్న తపన రక్తదానం చేసేందుకు వచ్చిన ప్రతి జన సైనికుడిలో కనబడింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీ మనోహర్ గారు డోనర్ సర్టిఫికెట్లు అందచేశారు. ఇంత మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం మొదటిసారి చూస్తున్నామని జీజీహెచ్ వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. జనసేన శ్రేణులు ఇచ్చిన రక్తం ద్వారా 1200 మందికి పైగా ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. పార్టీ డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ డా. పాకనాటి గౌతమ్ రాజ్ రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు.
* జనసేనానికి అన్నదాతల కానుక
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై తమకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు రైతులు, చేనేత, చేతి వృత్తుల కళాకారులు. తాము పండించిన ధాన్యం, కూరగాయలు, పండ్లలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల రైతులు జనసేనానికి జన్మదిన కానుకగా పంపారు. పొందూరు నుంచి చేనేత కళాకారులు వస్త్రాలను పంపగా, ఏటికొప్పాక నుంచి కళాకారులు కొయ్య బొమ్మల్ని కానుకగా పంపారు. గోదావరి జిల్లాల రైతులు ధాన్యాన్ని, నర్సరీ రైతులు మొక్కలను పార్టీ కార్యాలయానికి పంపారు. చిత్తూరు నుంచి టమాటాలు, అనంత నుంచి బత్తాయిలు, కడప జిల్లా రైతులు బొప్పాయిలను.. ఇలా ఒక్కో జిల్లా రైతులు తాము పండించిన పంటను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. ప్రతి అడుగులో అన్నదాతకు అండగా పోరాడుతూ.. కౌలు రైతుల కుటుంబాల్లో భరోసాతో కూడిన వెలుగులు నింపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ పంటలను బహూకరించారు.