సత్యసాయి మంచి నీటి పథకాన్ని కొనసాగించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదు

• ఏలూరు జిల్లాలో 8 లక్షల మందికి శుద్ధ జలాలు అందకుండా చేస్తున్నారు
• శ్రీ సత్యసాయి బాబా బోధించిన సేవా ధర్మాన్ని పాలకులు విస్మరించారు

శ్రీ సత్యసాయి బాబా అందించిన స్ఫూర్తితో పోలవరంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించిన సురక్షిత మంచి నీటి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఫలితంగా ఏజెన్సీ గ్రామాలు, మెట్ట ప్రాంతాల వారికి శుద్ధి చేసిన జలాలు అందకుండా పోయాయి. వైసీపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఆ పథకం నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం మూలంగానే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఏలూరు జిల్లాలో 250 గ్రామాల్లో 8 లక్షల మందికి రక్షిత మంచి నీరు సరఫరా చేసేలా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దింది. ఏటా నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. ఇందులో పని చేసే 160 మంది ఉద్యోగులకు గత 18 నెలలుగా జీతాలు కూడా అందటం లేదు. ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు సురక్షిత తాగు నీరు అందించాలని జనసేన నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని పని చేయకుండా చేస్తున్నారు అనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా బోధించిన సేవా ధర్మాన్ని పాలకులు విస్మరించారు. లక్షలమంది భక్తులను కదిలించిన ఆయన సేవా స్ఫూర్తి పాలకుల్లో లేకపోవడం దురదృష్టకరం. తక్షణమే ఈ పథకానికి నిర్వహణ నిధులు మంజూరు చేసి 8 లక్షల మందికి తాగు నీరు అందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని శ్రీ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.