టోఫెల్ టోపీ… ప్రజా ధనం లూటీ

• విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం
• 3 నుంచి 10 విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్ష
• ఈటీఎస్ వెంటపడి మరీ ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
• ఏటా రూ.1052 కోట్లకు ఎసరు… 2027 వరకు పథకం ఎంఓయూ
• ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం
• అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారు
• జగన్ పేరుతో విదేశీ విద్యా పథకం తెచ్చి ఏం సాధించారు?
• తెనాలి విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘టోఫెల్ విద్యా పథకం పేరుతో మరోసారి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి.. పన్నులు చెల్లించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టోపీ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా పేద పిల్లల పేరుతో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ ను బలవంతంగా రుద్దుతూ, ఆ ముసుగులో వేల కోట్ల రూపాయలను జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. తెనాలిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “టోఫెల్ పరీక్ష అనేది డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఒక వేళ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లాలని భావిస్తే… ముఖ్యంగా అమెరికా వెళ్ళేవాళ్లు ముందుగా వారి ఇంగ్లీషు పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్. ఈ పరీక్షను ఈటీఎస్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తారు. జగన్ ప్రభుత్వం మాత్రం టోఫెల్ పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 వ సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనుంది. నాలుగు సంవత్సరాలకు కలిపి రూ.4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారు. వచ్చే అయిదు నెలల్లో ఇంటికి వెళ్లబోయే ప్రభుత్వం, ఈటీఎస్ సంస్థ వెంటపడి మరీ ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వైసీపీ పెద్దల స్వలాభం దాగుంది. కచ్చితంగా ఈ ఒప్పందం ఎందుకు చేసుకుందో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.
• ఏ మాత్రం ఉపయోగం లేని పరీక్ష ఎందుకు?
టోఫెల్ పరీక్షను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థులు రాస్తారు. ఇది మూడవ తరగతి పిల్లలకు ఏ మాత్రం పనికిరాదు. అలాగే పదో తరగతి పిల్లలు ఈ పరీక్ష రాసి, ఉత్తీర్ణులు అయినా వారికీ ఉపయోగం లేదు. వారు డిగ్రీ పూర్తి అయ్యే సమయానికి టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణతకు ఉండే రెండేళ్ల గడువు పూర్తవుతుంది. అంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పొందే స్కోర్ రెండు సంవత్సరాలు మాత్రమే పరిగణనలో ఉంటుంది. మరి అలాంటప్పుడు పదో తరగతి విద్యార్థులకు సైతం ఈ పరీక్ష ఏ మాత్రం ఉపయోగపడదు. దీని కోసం రాష్ట్రంలోని 1,06,00,316 మంది పిల్లలను కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ప్రయోజనం లేని టోఫెల్ పరీక్షకు రూ.4 వేల కోట్ల ఖర్చు ఎందుకు..? అమెరికా దేశం ప్రతి ఏటా తమ దేశంలో చదువుకోవడానికి వచ్చేవారి కోసం నాలుగు లక్షల వీసాలను మాత్రమే ఇస్తోంది. దానిలో సుమారు 45 వేల వీసాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి. అమెరికా చదువుకోవడానికి అంత మందినే అనుమతించినప్పుడు టోఫెల్ పరీక్షలు విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడతాయి..? రాష్ట్రంలో ప్రతి ఏటా 3.17 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. దీనిలో 1.20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు. వీరంతా ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లరు. ఒక వేళ వెళ్ళాలి అనుకున్న వారికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టోఫెల్ పథకం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరి ఎందుకు ఈ పథకం అంత ఖర్చుపెట్టి అమలు చేస్తున్నారు అన్నది సందేహాస్పదంగా ఉంది. పోనీ ఇంగ్లీష్ విద్యలో చిన్నారులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కనిపించడం లేదు.
• ఉన్నది… 12 వందల మంది ఇంగ్లీష్ టీచర్స్ మాత్రమే
రాష్ట్రంలో ఉన్న 1.81 లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వారు ఈ పథకంలో పిల్లలకు ఎలా ఉపయోగపడతారు? ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులు పరీక్షకు పిల్లలను ఎలా సమాయత్తం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి విచిత్రమైన ఆలోచన నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతకీ వచ్చి ఉండదు. పేద పిల్లల పేరు చెప్పి వేలకోట్ల రూపాయలను పక్కదారి పట్టించడానికి ఈ పన్నాగం అని తెలుస్తోంది. ఒక రోజు సీబీఎస్సీ సిలబస్ అంటూ, మరో రోజు ఐబీ సిలబస్ అంటూ… ఇంకో రోజు టోఫెల్ అంటూ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎందరో విద్యార్థులకు విదేశీ విద్య కల తీర్చే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కుదించారు. కేవలం ప్రపంచంలో 100 పేరెన్నికగన్న యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే సహాయం అందిస్తామని చెప్పారు. పథకం పేరును మార్చేసి, గత నాలుగున్నర ఏళ్లలో 357 మంది విద్యార్థులకు, కేవలం రూ.45 కోట్లు సాయం చేసి మమ అనిపించారు. పథకం ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పడేసారు.
• బస్సు యాత్రలో ముఖ్యమంత్రి ఉంటే రోడ్ల దుస్థితి తెలిసేది
వైసీపీ నాయకుడు ఘనంగా ప్రకటించిన బస్సు యాత్రలో ముఖ్యమంత్రి సహా పాలకులంతా పర్యటిస్తారని భావించాను. దీని వల్ల అయినా రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ముఖ్యమంత్రికి తెలుస్తుందని అనుకున్నాను. కానీ వైసీపీ తలపెట్టిన బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు మాత్రమే ఉంటారని, ముఖ్యమంత్రి యథావిధిగా హెలికాప్టర్లో చక్కర్లు కొడతారని చెప్పడంతో మొత్తం ఆశలు ఆవిరి అయ్యాయి. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది అని నేను భావించాను. కానీ ఆయన బుద్ధి ఏమాత్రం మారలేదు. బస్సు యాత్రలో నాయకులంతా కింద తిరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం తాపీగా హెలికాప్టర్లో వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకు ఎలా కనిపిస్తాయి..?
• హడావిడి ఒప్పందంపై సమగ్ర విచారణ చేయాలి
ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న టోఫెల్ పథకంపై సమగ్ర విచారణ జరగాలి. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. విద్యార్థులకు ప్రయోజనం లేని పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళిక వేసింది ఎవరు అనే విషయాలు ప్రజలకు తెలియాలి. విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ బండారు రవికాంత్, శ్రీ ఇస్మాయిల్ బేగ్, శ్రీ జాకీర్ హుస్సేన్, శ్రీ హరిదాసు గంగాధర్, శ్రీ దివ్వెల మధుబాబు పాల్గొన్నారు.