జగనన్న లేఅవుట్ లో మౌళిక సౌకర్యాలు శూన్యం …!

  • భూముల కొనుగోళ్లు ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలి…!
  • వెంకంపేట జగనన్న లే అవుట్ ను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం, పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన వెంకంపేట గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లో మౌలిక సౌకర్యాలు శూన్యమని జనసేన పార్టీ నాయకులు అన్నారు. శనివారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ లు జగనన్న లే అవుట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీ లే అవుట్లలోని పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలనీలా పరిస్థితి చూస్తే ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీగా తమకు తోచిందన్నారు. సాధారణంగా లేఅవుట్ ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా రోడ్లు, డ్రైనేజీలు, నీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కానీ సంబంధిత అధికారులు, పాలకులు లేఅవుట్ కు కొత్త నిర్వచనం ఇస్తూ లేఅవుట్ లోకి ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ తెచ్చే వాహనాలు రాకపోకలకు అవసరమైన రోడ్డు సదుపాయం కానీ, ఇళ్ల నిర్మాణాలు అవసరమైన నీటి సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని ఏర్పాటు చేయకుండానే లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో లబ్ధిదారులు నీరు, మెటీరియల్ తెచ్చుకునేందుకు అదనపు ఖర్చులు పెట్టుకుంటూ నిర్మాణాలు చెస్తున్నారన్నారు. వచ్చినటువంటి మొత్తం పునాదులుకే సరిపడక అప్పులు చేయలేక నిర్మాణాలు చేయలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ కాలనీలో మూడు నాలుగు ఇల్లు తప్ప మిగతావి నిర్మాణాలు పూర్తి కాలేదు అన్నారు. కొన్ని పునాదులు వద్ద ఆగితే మరికొన్ని పునాదులు కూడా తీయలేదన్నారు. వర్షాకాలం వచ్చిందని ఈ కాలంలో ఇక నిర్మాణాలు ఏ విధంగా జరుగుతాయో అధికారులు, పాలకులు సమాధానం చెప్పాలన్నారు. ఇకపోతే వెంకంపేట, మరికి, నర్సిపురం సమీపంలో జగనన్న లేఅవుట్ల కోసం కొనుగోలు చేసిన భూములు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో లేఅవుట్ కోసం భూములు, ఎవరి దగ్గర, ఎన్ని భూములు కొన్నారు, ఎంత మొత్తానికి కొన్నారు, మార్కెట్ రేటు ఎంత, ఎంత మొత్తాలు, ఎవరికి చెల్లించారు అనేవి ప్రజలకు తెలియజేయాలన్నారు. లేని పక్షంలో ఆరోపణలు నిజంగానే భావించాల్సి వస్తుందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించాలని కోరారు. దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు రూఢీ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి జగనన్న లేఔట్ లో లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.