అమ్మో మీటర్లా.. అంటున్న అన్నదాత!

*ఉచిత విద్యుత్తుకు మంగళం పాడతారన్న భయం
*పరిమితులు విధిస్తారేమోనన్న అనుమానాలూ
*అదనపు అప్పు కోసమే ఇదంతా….
*అదానీ మేలుకు కూడా అనే వాదన

రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటు చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 28,000 వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. మిగతా జిల్లాల్లో కూడా రైతుల వద్ద నుంచి అంగీకార పత్రాలు దాదాపు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. అంటే ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. మోటార్లకు మీటర్లు బిగించడంపై అక్కడక్కడా రైతులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వం పెద్దగా ఖాతరు చేయడం లేదు. రాబోయే కొద్ది నెలల్లోనే మోటార్లకు మీటర్ల ఏర్పాటు పనులు పూర్తి కానున్నాయి.
*ఇలా మొదలైంది….
దేశంలో వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్తుకు లెక్కలు తేల్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రాల్లో మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇలా మీటర్లు ఏర్పాటు చేస్తే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిధిని 0.5 శాతం పెంచుతామని తెలిపింది. అంటే ఆయా రాష్ట్రాల జి.ఎస్.డి.పి.లను బట్టి అదనంగా అప్పులు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రక్రియను దేశంలో 26 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం లేదు. కానీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఇలా అదనపు అప్పు తీసుకునేందుకు అనుమతులు కూడా సాధించింది. ఇక వెంటనే రాష్ట్రంలో అతి తక్కువ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి మీటర్లు బిగించే పనులు ప్రారంభించి, పూర్తి చేశారు. అక్కడ రైతుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో, రాష్ట్రం మొత్తం మీటర్లు బిగించేందుకు రైతుల వద్ద నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియ వేగవంతమైంది.
*మరో వాదన కూడా ఉంది
రైతులకు పగటి పూట ఒకేదఫా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని వైసీపీ అధినేత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేకపోయారు. చాలా ప్రాంతాల్లో గత రెండు నెలల నుంచి రోజుకు రెండు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేశారు. పంటలు ఎండిపోయి కొన్ని ప్రాంతాల రైతులు రోడ్డెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వ్యవసాయానికి 7000 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశారు. సోలార్ విద్యుత్ పగటి పూట మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, సోలార్ విద్యుత్ కొనుగోలుకు అదానీతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే దేశ వ్యాప్తంగా యూనిట్ సోలార్ విద్యుత్ రూ.1.99కి లభిస్తుంటే, ఏపీ ప్రభుత్వం అదానీకి యూనిట్ కు రూ.2.45 పైసలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే అదానీ సోలార్ ప్లాంటు నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ఏటా ప్రభుత్వంపై రూ.4,200 కోట్ల అదనపు భారం పడుతుందని వారు చెబుతున్నారు. ఇక అదానీ కంపెనీ రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సోలార్ కంపెనీకి రూ.35,000 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో పీపీఏలు చేసుకున్నా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. అందుకే పంపుసెట్లకు మీటర్లు బిగించి, రైతులు వినియోగించుకున్న కరెంటుకు ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించిందన్న చర్చ సాగుతోంది. ఆ నగదును ఆటోమేటిక్ గా డ్రా చేసుకునేందుకు రైతుల వద్ద నుంచి అంగీకార ప్రతాలు తీసుకున్నారు. దీంతో అదానీ కంపెనీ బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగిపోయిందని తెలుస్తోంది. అంటే అదానీకి మేలు చేయడం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
*ప్రభుత్వం చెబుతోంది ఇదీ….
వ్యవసాయ మోటార్లకు మీటర్లు లేకపోవడం వల్ల విద్యుత్ పంపిణీ నష్టాలను కూడా డిస్కమ్ లు ఉచిత విద్యుత్ ఖాతాలో కలుపుతున్నాయని, ప్రభుత్వం ఏటా అదనంగా రూ.3,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మీటర్లు పెట్టడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.3,000 కోట్లు ఆదా అవుతాయని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు బిగించడం వల్ల ప్రభుత్వ రాయితీ 33 శాతం ఆదా అయిందని కూడా ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ వినియోగం ఎంత ఉందో తేల్చేందుకే మీటర్లు పెడుతున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెడుతున్నామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు.
*రైతుల భయాలు
17 సంవత్సరాలుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఫీడర్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడక్కడా విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ వినియోగం అంచనా వేస్తున్నారు. ఒక్కో రైతుకు సగటున ఏటా రూ.52,000 విలువైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఇది రైతులు సాగు చేసిన పంటలనుబట్టి మారుతూ ఉంటుంది. మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో 5 ఎకరాలకే పరిమితం చేస్తారనే భయాందోళనలు రైతుల్లో ఉన్నాయి. ఆక్వా రంగంలో రైతులకు రాయితీపై విద్యుత్ సరఫరా అవుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం 5 ఎకరాలలోపు చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు మాత్రమే రాయితీలను పరిమితం చేశారు. వ్యవసాయానికి కూడా ఇలాగే చేస్తారనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రైతుల ఖాతాలో ఉచిత విద్యుత్ నగదును ప్రభుత్వం జమ చేయకపోతే, అప్పటికే రైతుల ఖాతాలోని సొమ్మును డిస్కమ్ లు లాగేసుకునే ప్రమాదం ఉంది. ఖాతాలో అసలు నగదు లేకపోతే విద్యుత్ కనెక్షన్లు కట్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ రాయితీలు వినియోగదారుల ఖాతాల్లో వేసి, తరువాత తగ్గించుకుంటూ ప్రస్తుతం రాయితీ మొత్తం ఎత్తివేసిన చందంగానే చేస్తారనే అనుమానాలు రైతులను వేధిస్తున్నాయి. మీటర్లు బిగించడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన ఉంది. కొన్ని జిల్లాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు.
రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 28,000 మోటార్లకు మీటర్లు బిగించారు. ఇక మిగిలిన జిల్లాల్లోని 15.99 లక్షల మంది రైతుల వద్ద నుంచి దాదాపు అంగీకార పత్రాలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది మంది నుంచి ఇంకా హామీ పత్రాలు తీసుకోవాల్సి ఉంది. రాబోయే 6 నెలల్లోనే మీటర్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీటర్ల ఏర్పాటు అయితే గ్యారంటీ…. కానీ నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అలాగే మీటర్ల ఏర్పాటు నేపథ్యంలో రైతుల భయాందోళనలకు కూడా ఫుల్ స్టాప్ పడాల్సి ఉంది.