తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం: నేరేళ్ళ సురేష్

  • ఎవర్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే
  • నిబంధనల పేరుతో అర్హులకూ ఫించన్లు ఎత్తివేత
  • పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
  • గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జాడే కనపడటం లేదని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రెండో డివిజన్ లోని ఇజ్రాయిల్ పేట , ఆర్ టీ సీ కాలనిలో ఆయన పర్యటించారు. ప్రజల్ని కలుసుకొని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు శాసనసభ్యులుగా ముస్తఫా పదవిలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించటంలోనూ శాసనసభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కాలనిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ కానీ సైడ్ కాలువల నిర్మాణాలు కానీ చేపట్టకపోవడంతో ఇళ్ల ముందు మురుగు పేరుకుపోయి విపరీతమైన దుర్గంధంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మురికికూపంలో నివసిస్తున్నా స్థానిక కార్పొరేటర్ కానీ శాసనసభ్యుడు కానీ ఇటువైపుకి తొంగిచూసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ నేతలు అర్హులైన పేదలకు కూడా నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలను తీసేసారని మండిపడ్డారు. పధకాల కోసం చేస్తున్న వేల కోట్ల అప్పులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా , ఎవరిని కదిలించినా ప్రభుత్వం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిజాయితీ , నిబద్ధత , సమాజం పట్ల బాధ్యత కలిగిన పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని నెరేళ్ళ సురేష్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు, గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుక రాజు , గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర మరియు 2 డివిజన్ ప్రెసిడెంట్ గడ్డం రోశయ్య, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మరియు 2 డివిజన్ కమిటీ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.