జనసేన గురించి ఆలోచించండి… ఆశీర్వదించండి

•రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేనకు అవకాశం ఇవ్వండి
•జనసేన అభ్యర్థిలో నన్ను చూడండి
•పటిష్టమైన పాలనకు జనసేన వ్యూహం
•గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే మార్పు పులివెందులను తాకాలి
•వైసీపీ వాళ్ళకు నోరు, చెయ్యి లేస్తే… మాకూ నోరు, చెయ్యి లేస్తుంది
•అన్నగా అమ్మేస్తున్నాడు… మామయ్యగా ముంచేస్తున్నాడు!
•అంబేద్కర్ స్ఫూర్తిని వైసీపీ కాలరాస్తోంది
•అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసింది
•ప్రజలపై కక్షగట్టి అధికారం తెచ్చుకొని ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు
•ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తాం
• మండపేటలో కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘నేను… ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు వేయమని అడగడం లేదు. దశాబ్దంన్నర నుంచి ప్రజల కష్టాలను నిశితంగా పరిశీలించాను. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నాను. ప్రజల కోసం జనసేన నిలబడుతుందా..? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి? జనసేన పార్టీ పాలన ఎలా ఉంటుంది? అని మీరే ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో చర్చించుకోండి. ఆలోచించి ఆశీర్వదించండి. నాకు ఎప్పుడూ ఇవ్వడమే తప్ప అడగడం తెలియదు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కచ్చితంగా జనసేనకు అవకాశం ఇవ్వాలని, మీరంతా దీనిపై చర్చించుకుని ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర సభ నిర్వహిచారు. రాజమండ్రిలో ఉదయం 11 గం.కు మొదలైన యాత్ర మండపేట చేరేందుకు సాయంత్రం 5గం. దాటింది. రాజానగరం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కొత్తపేట నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. దారిపొడవున జనసేన నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు నీరాజనాలు పలికారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సంబంధించిన కుటుంబాలను మండపేటలోని సభా వేదికపై పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందచేశారు. ఈ వేదికపై 51మందికి చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. “ప్రజాక్షేత్రంలో ఎలాంటి బెదురుబెరుకు లేకుండా నిలబడతాం. ప్రజలకు అద్భుతమైన పాలన అందించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. పోటీ చేసే జనసేన అభ్యర్థిలో నన్ను చూడండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి కోసం జనసేన పార్టీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అవినీతికి ఆస్కారం ఇవ్వను. కచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో జనసేన జెండాను ఎగురవేస్తాం. మీకు మేము జవాబుదారీగా ఉంటాం.
•బూటకపు మాటలకు బలి చేస్తున్నారు
అన్న వస్తున్నాడు… మామయ్య వస్తున్నాడు… మంచి రోజులు వస్తున్నాయి అని మభ్య పెట్టారు. అమలు చేయలేని హామీలు ఇష్టానుసారం ఇచ్చేశారు. అధికారమే పరమావధిగా నోటికొచ్చిన ప్రతి వాగ్దానం చేశారు. ఇప్పుడు ప్రజలను ఆనాటి బూటకపు మాటలకు బలి చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇచ్చేస్తామని రకరకాల మాటలు చెప్పారు. అడిగినదానికి, అడగని దానికి కూడా అధికారం కోసం హామీల వర్షం కురిపించిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుంది.
•పాదయాత్ర చేసిన వాళ్ళంతా మహానుభావులు అయిపోరు
పాలనలో కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. రాజకీయం అస్సలు చూడం అని చిలక పలుకులు పలికిన వ్యక్తులే.. ఇప్పుడు వాటిని ప్రాతిపదికగా చేసుకొని పాలన చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని కుట్రలు పన్నుతున్నారు. ప్రజలపై కక్ష కట్టి మరీ అధికారం కోసం పాదయాత్రలు చేశారు. ఆ అధికారం అందగానే ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. అప్పట్లో మహాత్మా గాంధీ, వినోబాభావే లాంటి మహానుభావులు పాదయాత్రలు చేశారు. ఇప్పుడు చేసినవాళ్ళు వారితో పోల్చుకుని గెలిచి.. ఆ తర్వాత కాలు కింద పెట్టడం పూర్తిగా మానేశారు. హెలికాప్టర్లు, విమానాల్లోనే తిరుగుతున్నారు. ప్రజల మధ్య కనీసం తిరిగితే వారి బాధలు అయినా తెలుస్తాయి. కాబట్టి పాదయాత్రలు చేసినవారంతా మహానుభావులు అయిపోరు.
•నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు… లక్ష కోట్ల ఆస్తులు లేవు
చైతన్యానికి గోదావరి జిల్లాలు ప్రతీక. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తి గోదావరి జిల్లాలకు ఉంది. ఇక్కడి నుంచి మొదలయ్యే మార్పు పులివెందులను తాకాలి. ఆ ప్రాంతాన్ని కూడా మార్పులోకి తీసుకురావాలి. ఒకసారి మోసం చేయటానికి అలవాటు పడిన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల సమయంలో ముద్దుల మామయ్య వస్తున్నాడు, అన్న వస్తున్నాడు అంటూ మళ్లీ మన దగ్గరికి వస్తారు. జనం ఎవరి వైపు నిలబడతారో నిర్ణయించుకోండి. ఒకసారి ఓటు వేసిన పాపానికి కొన్ని దశాబ్దాలు అప్పులు కట్టుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదు. వైసీపీ అధినేతలా సిమెంట్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, లక్ష కోట్ల ఆస్తులు నాకు లేవు. కానీ తోటి వాడు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయాలనే గుణం ఉంది. జనసేన అదే సిద్ధాంతంతో ముందుకు వెళుతుంది. దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదు. మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకోవడం అంటే ప్రజలకు మాయ మాటలు చెప్పి, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టడం కాదు. ఆయన స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి. దేశ ప్రజలకు ఎంత మేలు చేయాలి .. ఏం చేయాలి అన్నది రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ గారు దేశ ప్రజలకు అందించారు. ప్రజలకు మేలు చేయడం అంటే అది. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పడం కాదు. వైసీపీ శాసనమండలి సభ్యుడు దళిత డ్రైవర్ ను కిరాతకంగా చంపితే నిందితున్ని రక్షించడం కాదు. భారతదేశంలో ప్రతి వ్యక్తి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడే పని చేయాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఏ ప్రజల కోసం అయితే ఆయన పని చేయాలనుకున్నారో, జీవితం త్యాగం చేయాలనుకున్నారో ఆ ప్రజల చేతిలోనే ఆయన ఓటమి పాలయ్యారు. అయినా ఆయన ప్రయాణం ఆగలేదు. రాజకీయ ప్రయోజనాలకు అంబేద్కర్ పేరును జనసేన ఎప్పటికీ వాడదు.
•ఎన్టీఆర్, సత్యసాయి పేర్లు పెట్టినప్పుడే పెట్టాల్సింది కదా?
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును వివాదం చేసి లబ్ధి పొందాలని అధికార పార్టీ చేసిన కుట్ర కోణమే కోనసీమ అల్లర్లు. అధికార పార్టీకి ఆ ఉద్దేశం లేకపోతే ఎన్టీఆర్, సత్యసాయి పేర్లను ఆయా జిల్లాలకు పెట్టినప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టి ఉండాలి. అలా కాదు అంటే కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి అంబేద్కర్ పేరును వివాదం చేసి, ఇతరులను ఇరికించే కుట్ర చేయడానికి ఇదంతా చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే అల్లర్లలో పూర్తిగా కాలిపోయిన మంత్రి ఇంటికి గాని, ఎమ్మెల్యే ఇంటికి గానీ ముఖ్యమంత్రి వెళ్ళలేదు. మరి అంత ప్రేమ ఉంటే వారిని ఎందుకు పరామర్శించలేదు.? జాతి నాయకులను మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. జాతీయ నాయకులను భవిష్యత్తులోనూ కులం, మతం చూడకుండా గౌరవించుకుంటామని మండపేట సభ సాక్షిగా జనసేన తీర్మానం చేస్తోంది.
•పోరాడే దమ్ము లేకపోతే అరాచకవాదమే రాజ్యమేలుతుంది
అన్యాయాన్ని ఎదుర్కొనే గొంతు లేకపోతే, అక్రమాన్ని ఎదుర్కొనే దమ్ము లేకపోతే అరాచకవాదమే రాజ్యమేలుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదే. కచ్చితంగా అన్యాయం జరిగితే ప్రశ్నించండి. బలంగా పోరాడండి. ఎంతమంది మీద కేసులు పెడతారు? వందలు, వేలు, లక్షల్లో అరెస్టులు చేస్తారా. చేయనివ్వండి! శ్రీలంక లాంటి దేశంలోనే ప్రధాని ప్రజల ఆగ్రహానికి గురై వేరే దేశం పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య దేశం మనది. ప్రజల ఆగ్రహానికి ఏ నాయకుడైనా తలవంచాల్సిందే. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వం పై ఖచ్చితంగా గొంతు ఎత్తాల్సిన సమయం వచ్చింది. దానిని ప్రతి ఒక్కరం అంది పుచ్చుకుందాం ఐక్యంగా ముందుకు వెళదాం. ఏ నాయకుడు తప్పు చేసిన చొక్కా పట్టుకొని నిలదీసే ధైర్యం ఉండాలి. రేపు పొద్దున్న జనసేన ప్రభుత్వం ఏర్పడినా, ప్రతినిధులను అలా అడిగేలా మా జవాబుదారితనం ఉంటుంది. కలల ఖనిజాలతో ఉన్న,కొండలను పిండి చేసే యువత మన ఆస్తి. పదిమందికి ఉపాధి కల్పించే యువతరం వచ్చేలా కచ్చితంగా జనసేన పార్టీ ప్రణాళికాయుతంగా ముందుకు వెళుతుంది. కచ్చితంగా నా ఒక్కడితోనే మార్పు సాధ్యమైపోతుంది అద్భుతాలు జరుగుతాయి అనుకోవద్దు. మంచి భావాలు ఉన్న సమూహాన్ని గెలిపించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుంది. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ హానికరం. జనసేన పార్టీ బలమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తుంది.
•పంచాయతీలను పూర్తిగా బలోపేతం చేస్తాం
వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పంచాయతీల నిధులను అక్రమ పద్ధతిలో మళ్లిస్తోంది. ప్రభుత్వ అవసరాలకు పంచాయతీ నిధులను వాడుకుంటున్నారు. గ్రామపంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది. పంచాయతీల నిర్వహణకు సైతం దేహి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటే సర్కారు ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో అర్థం చేసుకోవచ్చు. 15వ ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించారు. గాంధీజీ కలలు కన్న స్థానిక సంస్థల బలోపేతం ఆశయాలను, కలలను పూర్తిస్థాయిలో నెరవేర్చేలా జనసేన పాలన ఉంటుంది. లోకల్ బాడీస్ బలోపేతం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం.
•రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన దీటుగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. పోరాటాన్ని నమ్ముకుని ముందుకు వెళుతున్న వాళ్ళం. మార్పు కోసం ఆరాటపడుతున్న వాళ్ళం. 2019లో ఒకసారి చేసిన తప్పుకే రాష్ట్ర ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. దీనికి ప్రతి ఒక్క నాయకుడు జనసైనికుడు బలంగా పనిచేయాలి. ఎన్నికల ముందు పాదయాత్రలో అక్కలు, చెల్లెలు అంటూ ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి- అధికారంలోకి వచ్చిన తర్వాత గర్భిణీలను సైతం అంగన్వాడి కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. బడుల విలీనం పేరుతో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఎందరినో రోడ్డు మీదకు తెచ్చారు. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి పిల్లలకు తీసుకువచ్చారు. ప్రజా వ్యతిరేక పాలసీలు చేస్తున్న ప్రభుత్వం తీరును ప్రజలంతా గమనిస్తున్నారు.
•గోదావరి వరద ప్రాంతాల్లో సహాయం చేయండి
కరోనా సమయంలో విస్తృతంగా ప్రజలకు జనసేన పార్టీ సేవలు అందించింది. ఏ ఆపద వచ్చినా ప్రజలకు సహాయం చేసేందుకు జనసైనికులు, నాయకులు సిద్ధంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం కరోనా సమయంలో ప్రత్యేక విమానాలు పంపి స్వస్థలాలకు తీసుకువచ్చిన ఘనత జనసేన పార్టీకి ఉంది. ప్రస్తుతం గోదావరికి వరదల నేపథ్యంలో చాలా లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద బాధితులకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు సహాయం చేయాలని కోరుతున్నాను. గోదావరి ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయం కోసం ఎదురుచూసే వారికి ఇతోథికంగా సహాయం చేయండి.
•పోలీసు సిబ్బంది వ్యవస్థ కోసం పని చేయండి
పోలీసులు కేవలం రాజకీయ పార్టీ కోసమో వ్యక్తుల కోసమో పనిచేయడం కాదు. వ్యవస్థను నిలబెట్టేందుకు పని చేయాలి. ప్రతిసారి జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. వైసీపీ వాళ్ళకు నోరు, చెయ్యి లేస్తే – మాకూ నోరు, చెయ్యి లేస్తాయి. 99సార్లు భరిస్తాం సహిస్తాం..100 వ సారి మాత్రం తాట తీసి కింద కూర్చోబెడతాం. తెలుగు ప్రజల ఐక్యత ప్రధాన ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు వెళుతుంది. వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా నాశనం అయినట్లే. జనసేన బాధ్యతాయుతమైన పాలన అందిస్తుంది. జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం చేపట్టిన తరవాత కానీ ముఖ్యమంత్రికి ప్రజాదర్బార్ గుర్తుకు రాలేదు. బలమైన ప్రతిపక్షం ఉంటే అలా ఉంటుంది అని నిరూపించాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.