మత్స్యకారులకు భృతి… బతుకు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది

* వేటకు వెళ్లని సమయంలో ఇచ్చే కనీస సాయం కూడా అందడం లేదు
* మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం
* వైసీపీ నాయకుల జేబులు నింపుకోవడానికే పాలన
* చెత్త పన్ను పేరుతో వేధింపులు
* కాకినాడలోని మత్స్యకార ప్రాంతం దుమ్ములపేటలో పర్యటించిన నాదెండ్ల మనోహర్

ఉదయం లేస్తే ఎదుటి వారిని తిట్టుకోవడం, కాలాన్ని వృథా చేయడం తప్ప ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహనగానీ, వాటిని తీర్చేందుకు చిత్తశుద్ధిగానీ లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కాకినాడలోని మత్స్యకార ప్రాంతం దుమ్ములపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మత్స్యకారుల సమస్యలను, మత్స్యకారుల అభ్యున్నతిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో ప్రభుత్వం ఇచ్చే కనీస సహాయం కూడా ఈ ప్రభుత్వం అందించడం లేదు. సరైన డంపింగ్ యార్డులు పెట్టలేని ఈ ప్రభుత్వం చెత్త పన్నులు మాత్రం వసూలు చేస్తుందని స్థానికులు చెప్పడం బాధ కలిగిస్తోంది. నెలవారీ ఇచ్చే సామాజిక పింఛన్లలో చెత్త పన్నును మినహాయించుకొని ఇవ్వడం దుర్మార్గం. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసేలా ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్ 217 మీద పోరాడింది జనసేన పార్టీ. గతంలో మత్స్యకార భరోసా యాత్ర ద్వారా మత్స్యకారుల సమస్యలను స్వయంగా నేను తెలుసుకున్నాను. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
* అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారు
గతంలో వంద రూపాయలు ఉండే క్వార్టర్ మద్యం బాటిల్ ఇప్పుడు రూ.200 దాటింది. గంజాయి అమ్మకం ప్రతి వీధిలోను జరుగుతోంది. గంజాయి అమ్మకాలను బహిరంగం చేశారు. అసాంఘిక శక్తులను, అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించడంలో ఈ ప్రభుత్వం ముందుంది. తమ వారి జేబులు నింపడానికి ఈ ప్రభుత్వం రకరకాల అడ్డదారులు తొక్కుతోంది. మాండౌస్ తుపాను ప్రభావంతో రైతులు కష్టాల్లో ఉంటే, ఈ ప్రభుత్వంలోని మంత్రులు జనసేన పార్టీ వాహనం రంగు గురించి చర్చిస్తున్నారు. ఇదీ ఈ ప్రభుత్వ అసలు నైజం. తుపాన్లు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. ఆ సమయంలో వారికి ఉపాధి హామీ పథకం వర్తింప చేయాలి. బటన్లు నొక్కే ఈ ముఖ్యమంత్రి ఎంతమంది బతుకులు మార్చారో చెప్పాలి. నానాటికి మత్స్యకార సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. స్థానిక వంతెన నిర్మాణం కోసం ఇక్కడి యువత ఏళ్ల తరబడి పోరాడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజలకు నీరు లేదు.. గట్టిగా ఏదైనా సమస్య మీద అడిగితే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఘనంగా అందిస్తుంది అని చెప్పుకుంటున్న మత్స్యకార భరోసా సైతం అర్హులకు అందడం లేదు. మత్స్యకార సొసైటీలు నిర్వీర్యం చేశారు. సొసైటీ నుంచి గతంలో అందే కనీస సహాయం కానీ పనిముట్లుగాని ఎవరికి అందడం లేదు. ఇవేవీ ప్రభుత్వానికి పట్టవు. మత్స్యకారుల సమస్యలపై జనసేన పార్టీ చిత్తశుద్ధిగా ముందుకు వెళుతుంది. ఇచ్చిన ప్రతి హామీను కచ్చితంగా నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. జనవరి 12వ తేదీన రణస్థలంలో జరిగే యువశక్తి కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటన చేస్తారు. రాష్ట్రానికి జనసేన పార్టీ ప్రభుత్వంలో అందే అంశాలపై మాట్లాడుతారు. యువతకి ఉపాధి దొరికేలా, పెట్టుబడులు రప్పించేందుకు మా ప్రణాళిక ను చెబుతాం. వలసలు నిరోధించేలా చేయాలంటే ఏం చేయాలన్న దానిపైనా మాట్లాడుతాం” అన్నారు. సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ నాయకులు మేడా గురుదత్, తుమ్మల బాబు, మరెడ్డి శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, అత్తి సత్యనారాయణ, శ్రీమతి మాకినీడి శేషు కుమారి, వేగుళ్ళ లీలాకృష్ణ, శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీమతి ప్రియా సౌజన్య, శివదత్, సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ ప్రసాద్, తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.