క్రిప్టోకరెన్సీలతో మనీ లాండరింగ్‌ ముప్పు

క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయన్న ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. క్రిప్టోకరెన్సీల వినియోగంతో మనీలాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధులు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పునరుద్ఘాటించాయి. ఇటువంటి నియంత్రణ లేని మార్కెట్లకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశాయి. అధిక రాబడులు, పారదర్శకత లేని ప్రకటనలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఇటువంటి వాటిని తక్షణం నిలిపివేయాలని సమావేశంలో పలువురు బలంగా అభిప్రాయపడ్డారు. దీంతో నియంత్రణ సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఇది శరవేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. చర్యలు తీసుకునే ముందు క్రిప్టోకరెన్సీలపై ఓ కన్నేసి ఉంచనుంది. ప్రభుత్వం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయాలూ ఉన్నాయి’ అని సమావేశంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఈ అంశంపై నిపుణులు, సంబంధిత వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరపడం కొనసాగించాలని, ఇందుకోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త వ్యూహాలు అవసరమని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ, సంబంధిత అంశాలపై జరిగిన సమావేశం సమగ్రమైనదని తెలుస్తోంది.

ఆర్‌బీఐ వ్యతిరేకమే: ‘ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ, హోం శాఖలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిపుణులను సంప్రదించి పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఇది. అంతర్జాతీయ పరిణామాలు, చోటుచేసుకున్న సంఘటనలూ పరిగణనలోకి వచ్చాయి’ అని చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోకరెన్సీలు తీవ్ర సవాలుగా మారుతాయన్న వాదనలను ఆర్‌బీఐ మరోసారి పునరుద్ఘాటించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ చేస్తున్న పెట్టుబడిదార్ల సంఖ్య, మార్కెట్‌ విలువపై సైతం సందేహాలు వ్యక్తపరచింది. కేంద్ర బ్యాంకుల పరిధిలో లేకపోవడం వల్ల వీటితో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ నెలలో ఆర్‌బీఐ అంతర్గత ప్యానెల్‌ నివేదిక రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.