చేయూత లేక చెరకు సాగుకు చెల్లుచీటీ!

* బకాయిలు అందక రైతుల గగ్గోలు
* మూతపడుతున్న చక్కెర కర్మాగారాలు
* ఇదేనా ఉత్తరాంధ్ర ఉద్ధరణ?
* జగన్ హామీలన్నీ గాలికే….

రైతులకు చెరకు సాగు చేదు మిగుల్చుతోంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ప్రభుత్వ సహకారం అందకపోవడంతో రైతులు చెరకు సాగుకు ఆసక్తి చూపడం లేదు. గడచిన నాలుగేళ్లలో చెరకు సాగు గణనీయంగా పడిపోయింది. అధికారంలోకి వస్తే రైతులకు చెరకు బకాయిలు మొత్తం చెల్లించి మూతపడ్డ కర్మాగారాలు తెరిపిస్తామంటూ ఊదరగొట్టిన సీఎం జగన్‌ మడమ తిప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. దీంతో చెరకు సాగును రైతులు వదిలేస్తున్నారు.
*జగన్ ఇచ్చిన హామీలు
సహకార రంగంలోని చక్కెర మిల్లులు మూతపడేలా ఉన్నాయి. గోవాడ కర్మాగారం మూతపడే స్థితికి చేరింది. అధికారంలోకి రాగానే రైతులకు మేలుచేసే చర్యలు తీసుకుంటానని 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తుమ్మపాల కర్మాగారం రైతులకు బకాయిలు చెల్లించడం లేదని రైతులు చెప్పగా, మీ బాధలు విన్నాను. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. అయితే జగన్‌ రెడ్డి సీఎం అయ్యాక నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు మూసివేశారు. దీంతో ఉత్తరాంధ్రలో రైతులు 90 వేల ఎకరాల్లో చెరకు సాగు వదిలేయాల్సి వచ్చింది.
*చెరకు రైతుకు మొండిచేయి
2019 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో ఐదు చక్కెర కర్మాగారాలు సహకార రంగంలో పనిచేయగా…నేడు గోవాడ కర్మాగారం ఒక్కటే నడుస్తోంది. అది కూడా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. వైసీపీ అధికారంలోకి రాగానే తుమ్మపాల కర్మాగారాన్ని మూసివేశారు. దాని ఆస్తులు అమ్మేందుకు యత్నిస్తున్నారు. 2020-21లో విజయనగరం జిల్లాలోని బీమిసింగి కర్మాగారం, 2021-22లో అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక, తాండవ కర్మాగారాలను కూడా మూసేశారు. ఒక్కో చక్కెర కర్మాగారాన్ని మూసేస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టారు.
*పడిపోయిన చెరకు సాగు
నాలుగేళ్ల కిందటి వరకు ఉత్తరాంధ్రలో చెరకు సాగు రైతులకు, కూలీలకు బతుకుతెరువు చూపేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత పరిస్థితి దిగజారింది. కర్మాగారాలు మూతపడిపోవడంతో రైతులు చెరకు సాగుకు ముందుకురావడం లేదు. బెల్లం తయారు చేద్దామంటే ధరలు గిట్టుబాటు కావడం లేదు. దీనికితోడు నల్లబెల్లం తయారు చేస్తున్నారంటూ పోలీసులు కేసులు పెడుతున్నారు. చేసేది లేక రైతులు చెరకు సాగు వదిలేశారు. 2019నాటికి ఉత్తరాంధ్రలో 1.20 లక్షల ఎకరాల్లో చెరకు సాగుకాగా…2023నాటికి 30 వేల ఎకరాలకు పడిపోయింది. నాలుగేళ్లలోనే 90 వేల ఎకరాల్లో చెరకు సాగు తగ్గింది. బతుకుదెరువు కోసం రైతులు,కూలీలు వలసలు పోతున్నారు.
*నేటికీ చెల్లించని బకాయిలు
సహకారరంగంలో నడుస్తోన్న అనకాపల్లి జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం కూడా క్రషింగ్ తగ్గించుకుంటూ వస్తోంది. ఈ పరిశ్రమ 2018లో 4.5 లక్షల టన్నుల క్రషింగ్ చేయగా, 2022లో 2.21 లక్షల టన్నులకే పరిమితమైంది. చెరకు సరఫరా చేసిన రైతులకు ఎనిమిది నెలలు గడచినా బకాయిలు చెల్లించడం లేదు. గోవాడ చక్కెర పరిశ్రమ రైతులకు రూ.12 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. చెరకు పరిశ్రమకు తోలిన 15 రోజుల్లోనే రైతులకు నగదు చెల్లించాలి. కాని అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆలస్యం అయితే 14 శాతం వడ్డీతో చెల్లించాలి. రైతులకు రావాల్సిన అసలే చెల్లించడం లేదు. ఇక వడ్డీలు వస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏటికొప్పాక, తాండవ కర్మాగారాల్లో సిబ్బందికి రూ.22 కోట్ల బకాయిలు ఉన్నాయి.
*చెరకు రైతుకు అండగా నిలవాలి
చెరకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిన స్థాయిలో మద్దతు ధర పెరగకపోవడం ప్రధాన అవరోధంగా ఉంది. పరిశ్రమలు మూతపడిపోవడం, వెంటనే రైతులకు నగదు చెల్లించకపోవడం, కూలీల కొరత ఇవన్నీ చెరకు సాగు పడిపోవడానికి కారణాలు కాగా… ప్రభుత్వం చేయూత అందించకుండా చేతులెత్తేయడం మరింత సంక్షోభానికి కారణభూతమైంది.