టిఆర్ పురం అభాగ్యులకు న్యాయం చేయాలి

  • జగనన్న కాలనీ కాదు అది డబ్బుల కాలనీ
  • రెండు రోజుల్లో పరిష్కారం చూపకపోతే శుక్రవారం మహాధర్నా
  • జనసేన ఇంచార్జ్ యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: వెదురుకుప్పం మండలం, టికేఎం పురం గ్రామపంచాయతి, బిఆర్ పురం గ్రామ వాసులకు జగనన్న కాలనీలో చోటు లేదని నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన వార్తపై జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది నిరుపేదల జగనన్న కాలనీ కాదు, అది ఉన్నవాళ్ల డబ్బుల కాలనీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ఉన్న అభాగ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నిజమైన లబ్ధిదారులతో కలిసి వారి ఇళ్లను, జగనన్న కాలనీని స్వయంగా సందర్శించి పరిశీలించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కాళ్లు అరిగేటట్లు ఇక్కడి ప్రజలు జిల్లా అధికారులకు, మండల అధికారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పదేపదే విజ్ఞాపన పత్రం అందించినప్పటికీ స్పందన రాకపోగా, కొత్తగా వచ్చిన మండల అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇంకా 17 మందికి పైగా ఈ గ్రామ వాసులకు అదే జగనన్న కాలనీలో ఇంటి పట్టాలి ఇచ్చి, ఇంటి నిర్మాణ పత్రాలు మంజూరు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇల్లు కేటాయించకుండా ఉన్నవాళ్లకే ఇల్లు కేటాయించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా వెదురుకుప్పం తాసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల హౌసింగ్ అధికారి తక్షణమే టిఆర్ పురాన్ని సందర్శించి 17 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అది యుద్ధ ప్రాతిపదికన జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కారం చూపకపోతే శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, మండల ఉపాధ్యక్షులు ముని, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి మరియు మండల ఇంచార్జ్ వెంకటేష్, మండల కార్యదర్శి హేమంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.