ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన మద్దతుదారులు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ సమయంలో ట్రంప్ తన చర్యలతో మరో సారి విమర్శలపాలయ్యారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి అందరికీ షాకిచ్చారు. బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కాసేపు తిరిగారు.

హాస్పిటల్ బయట వేచి చూస్తున్న తన మద్దతుదారులను పలకరించేందుకు ఓ యూఎస్‌యూవీ కారులో బయటకు వెళ్లారు. మాస్క్ ధరించిన ట్రంప్ తన అభిమానుల్ని కారులో నుంచి సంకేతాలతో పలుకరించారు. అయితే కోవిడ్ లక్షణాలతో ట్రంప్ కారులో బయటకు వెళ్లడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలా చేయడం వల్ల ఆయన సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి తీవ్రమైనదే అయినా.. ట్రంప్ మాత్రం ఫోటోషూట్ స్టయిల్‌లో హాస్పిటల్ బయట తిరగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

కరోనా సోకిన ట్రంప్ నెగటీవ్ రాకుండానే ఇలా బయటకు రావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకుండా.. ఐసోలేషన్ లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధ్యక్షుడు ఇలా బయటకు రావడంపై పలువురు మండిపడుతున్నారు.

కాగా హాస్పిటల్‌లో ఉన్న ట్రంప్ ఓ ట్వీట్ లో కోవిడ్ గురించి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. స్కూల్‌కు వెళ్లి కోవిడ్ గురించి నేర్చుకున్నానన్నారు. ఇదే రియల్ స్కూల్ అని తెలిపారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, దీని గురించి మీకు పూర్తిగా తెలియజేస్తానని అన్నారు.