టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పతకాలు

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు రజతం గెలుచుకోగా, అదే క్రీడాంశంలో శరద్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రెండు పతకాల అనంతరం భారత్ సాధించిన పతకాల సంఖ్య 10కి పెరిగింది.

కాగా, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్ లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిలకడకు, ప్రతిభకు మరియప్పన్ తంగవేలు పర్యాయపదం వంటివాడని కొనియాడారు. అతడు గెలిచిన రజతం పట్ల దేశం గర్విస్తోందని తెలిపారు. ఇక, కాంస్యం గెలిచిన శరద్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ, తన ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్క భారతీయుడి మోములో సంతోషం నింపాడని పేర్కొన్నారు.