US General : ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీయవచ్చు ..!

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు చూస్తుంటే అంతర్యుద్ధానికి దారితీసే విధంగా ఉన్నాయని అమెరికా జనరల్‌ మీడియాకు తెలిపారు. దేశంలో ఉగ్రవాద మూకలు మళ్లీ చెలరేగేలా ఉన్నాయని హెచ్చరించారు. సైనిక అంచనా ప్రకారం.. అంతర్యుద్ధం ఏర్పడే అవకాశం ఉందని జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ మార్క్‌ మిల్లే మీడియాకు తెలిపారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే అల్‌ – ఖైదా, ఐసిస్‌ లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పెరుగుదలకు దారితీయవచ్చని అన్నారు. తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని.. అధికారాన్ని ఏకీకృతం చేసి సమర్థవంతమైన పాలనను వారు అందించగలరా అని ప్రశ్నించారు. ఆఫ్ఘన్‌లో రోజువారీ పరిస్థితులు భయానకంగా మారుతున్నాయని.. అక్కడ ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. రానున్న మూడేళ్లలో ఉగ్రవాదం మళ్లీ విస్తరించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబన్లు వేగంగా ఆఫ్ఘన్‌ను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పంజ్‌షీర్‌ను మాత్రం చేజిక్కించుకోలేకపోయాయి.