ముగిసిన టోక్యో పారాలింపిక్ క్రీడలు.. భారత బృందానికి ప్రధాని మోదీ అభినందనలు

జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి. ఈ సాయంత్రం ముగింపు ఉత్సవం నిర్వహించారు. బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్ లైటింగ్ షో ముగింపు వేడుకల్లో ఆకట్టుకున్నాయి. కాగా, పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖర ప్రాతినిధ్యం వహించింది. త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మొత్తం 19 పతకాలు లభించాయి. వాటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

కాగా, టోక్యో నుంచి తిరిగి వస్తున్న భారత బృందాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మనకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అభినందించారు. అథ్లెట్లు, కోచ్ లు, వారి కుటుంబసభ్యులకు అందరూ మద్దతివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు.