మీడియాని ఆయుధంలా వాడండి

• డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారు
• ఎయిడెడ్ కాలేజీలు మూతవేసి విద్యార్ధుల్ని కొడుతున్నారు
• రెండున్నరేళ్లుగా ఇసుక, మద్యం ముసుగులో దోచుకుంటున్నారు
• ఇసుకను పెద్ద ఇండస్ట్రీలా చూస్తున్నారు
• పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఎవరికి న్యాయం చేశాడు?
• 151 మంది ఎమ్మెల్యేలతో మూర్ఖంగా పాలిస్తున్నారు
• ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
• సోషల్ మీడియాను ఆయుధంగా వాడుదాం
• అన్ని కులాలకు రాజ్యాధికారం కల్పించే దిశగా జనసేన నిర్మాణం
• అనంతపురం జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎవ్వరికీ ఉపయోగపడని విధంగా ఉన్నాయనీ, శ్రీ జగన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని ఆదుకున్నారో ప్రజలకూ తెలియడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మహిళల్ని వంచించి రూ. 2 వేల కోట్ల డ్వాక్రా డబ్బులు దోచేశారు.. ఎయిడెడ్ కాలేజీలు మూసేసి అడిగిన విద్యార్ధులపై లాఠీఛార్జ్ లు చేయించారు.. రెండున్నరేళ్లుగా ఇసుక, మద్యం దోచుకుంటూనే ఉన్నారు అని తెలిపారు. పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ తిరిగింది దోచుకోవడానికేనా అంటూ నిలదీశారు. అనంతపురంలో జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రెండున్నరేళ్లుగా ఎవరూ వినని మద్యం బ్రాండ్లు తెచ్చి విచ్చలవిడిగా ధరలు పెంచి దోచుకున్నారు. ఇప్పుడు ఏదో డిస్కౌంట్ సేల్ లా ధరలు తగ్గించామని చెబుతున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్ముకుని పక్క రాష్ట్రాలకు లారీల్లో డబ్బు తరలించుకుపోయారు. ప్రజలకు ఎంత నష్టం కలిగించారో వారికే తెలియాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక తవ్వేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇన్ని ట్రాక్టర్లు, లారీలు ఇసుక తరలించిన పరిస్థితులు మొట్టమొదటి సారి చూస్తున్నాం. అదే పెద్ద ఇండస్ట్రీలా దోచేస్తున్నారు. జగనన్న కాలనీలు అన్నారు ఏ కాలనీలోనూ ఒక్క ఇల్లు కట్టింది లేదు. ఆ కాలనీలన్నీ మునిగిపోయి కనబడుతున్నాయి. పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టాడు. ఆదుకుంటానన్నాడు. ఏ వర్గాన్నీ ఆదుకుంది లేదు.

  • పెంచిన మొత్తం లాగేస్తున్నారు
    ఫించన్లు రూ. 250 పెంచామని వాళ్ళకి వాళ్లే చప్పట్లు కొట్టుకున్నారు. జనం మాత్రం చప్పట్లు కొట్టలేదు. ఎందుకంటే.. ఫించన్ ఇచ్చినందుకు రూ. 200 కమిషన్, చెత్తపన్ను పేరుతో రూ.50 లాగేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిస్సహాయులను కూడా వదలకుండా ఎప్పటికప్పుడు దోచేస్తున్నారు. వారు తీసుకుపోయిన జనసేన ఎమ్మెల్యేతో కలిపి 152 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని మూర్ఖంగా పాలన చేస్తుండడం వల్లే ఇంత మందికి నష్టం జరుగుతోంది. గ్రామాల్లో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజలు ఇచ్చిన ఓట్లను బలుపుగా భావించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా చూసిన పేపర్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పు రూ. 6 లక్షల కోట్లు కాదంట, రూ. 6 లక్షల 70 వేల కోట్లు ఉన్నాయంట. అంత అప్పు తెచ్చి ఏం చేశారు. రెండున్నరేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క గుంత పూడ్చలేదు. కొత్త చెరువులో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రమదానానికి వస్తున్నారని తెలిసి మూడేళ్లుగా వదిలేసిన రోడ్డును రాత్రికి రాత్రి బాగు చేశారు. ప్రజలు కూడా రోడ్డు బాగుపడినందుకు సంతోషించారు.
  • ఈ పాలనలో మైనారిటీలకు అన్యాయం

ముఖ్యమంత్రి పాలనలో మైనారిటీ సోదరులకు న్యాయం జరగలేదు. గతంలో మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఉండేవి. ఆ స్కీములన్నీ ఇప్పుడు ఏమయ్యాయి. ఎస్సీ, ఎస్టీల కోసం సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సబ్ ప్లాన్ మేరకు 14 శాతం నిధులు వారి అభివృద్ధి కోసం ఎట్టిపరిస్థితుల్లో ఖర్చుపెట్టాలన్న విధానం తీసుకువస్తే దాన్ని తుంగలో తొక్కారు.

  • నాడు నేడు రంగులకు రూ. కోట్లు కొల్లగొట్టారు

నాడు నేడు అని మొదలుపెట్టారు. పాఠశాలల అభివృద్ధి అన్నారు. వాళ్లకు నచ్చిన నాలుగు పాఠశాలలకు రంగులు, ఫోటోలు వేసి మమ అనిపిస్తున్నారు. రంగుల మార్పు పేరుతో ఒక్క అనంతపురం జిల్లాలో రూ. 300 కోట్లు కొట్టేశారు. ఇప్పటికీ మెజారిటీ శాతం గ్రామాల్లో పాఠశాల ల దుస్ధితి ఎలా ఉందో అందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఇదే జిల్లాలో ప్రారంభమైన జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పుడు ఎంత మందికి ఉపయోగపడుతుంది? ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ దుర్మార్గమైన పనులు. ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ? పాదయాత్రలో ఏం చెప్పారు. అనంత నుంచి ఎవ్వరూ వలసలు వెళ్లనవసరం లేదు.. ఇక్కడే ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తానన్నారు. అది ఎటుపోయిందో తెలియదు. ఈ రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ తెచ్చారా. ఎప్పుడో వచ్చిన కియానే మూత వేయించే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని పెద్దలు కల్పించుకోకుంటే ఆ పరిశ్రమ వెళ్లిపోవడానికి సిద్ధమైపోయింది. ఇలాంటి పనులు చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు. వైసీపీ పాలన కేవలం వారి పార్టీ నాయకుల కుటుంబాల కోసం తప్ప ప్రజల కోసం చేస్తోంది శూన్యం. జనసేన కార్యకర్తలుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి. సమస్యల మీద పోరాటం చేయండి. గ్రామాల్లో జెండా పట్టుకుని తిరిగినప్పుడే మీకు నిలబడే ధైర్యం వస్తుంది. అనంతపురం జిల్లాలో మనపార్టీ మంచి టీమ్ ఏర్పాటు చేసుకుంది. అన్ని కులాలకు రాజ్యాధికారం కల్పించే లక్ష్యంగా జనసేన పార్టీ నిర్మాణం సాగుతుంది. జిల్లాలో పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. మండలాలకు నెలాఖరులోపు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయండి. గ్రామ కమిటీలు వేసుకుని పార్టీ సిద్దాంతాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలన్ని ఇంటింటికీ తీసుకువెళ్లండి. పార్టీ పిలుపు మేరకు చేయాల్సిన కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యలపై కూడా పోరాటం చేయండి. రహదారుల మీద చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ అంతర్జాతీయ స్థాయిలో పార్టీకి ప్రతిష్ట తెచ్చి పెట్టింది. మొన్న మూడు రోజులు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అద్భుతంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాం. ప్రతి గ్రామంలో, పట్టణంలో అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు.

  • గ్రామ సమస్యల పరిష్కారం కోసం…

సోషల్ మీడియాని ఒక ఆయుధంగా వాడుకుందాం. పార్టీని పెంచడానికి, పార్టీ ప్రణాళికలు, కార్యక్రమాలు ప్రజలకు చేర్చేందుకు వాడుకుందాం. అదే సమయంలో ఏదో రెండు పోస్టులు పెట్టేశాం పని అయిపోయింది అనుకుంటే ఓట్లు రావు. మనం గ్రామాల్లో తిరిగేప్పుడు దాన్ని వినియోగించుకుందాం. పార్టీకి ఆదరణ పెరగాలంటే మాత్రం గ్రామ సమస్యల పరిష్కారం కోసం తిరగాలి. రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. జనసేన పార్టీ వద్ద ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక ఉంది. తాగునీటి సమస్య ఎలా పరిష్కరించాలి. రైతాంగాన్ని కాపాడడం ఎలా? మహిళలకు ఉపాధి కల్పించడం, అనంతపురం జిల్లా నుంచి యువత వలసలు పోకుండా ఇక్కడే అవకాశాలు కల్పించాలి. ఆ దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. శ్రీ జగన్ రెడ్డి గారిలా సిమెంటు ఫ్యాక్టరీల కోసం రూ. లక్ష కోట్లు కోసం ఆలోచించదు. ఉదయం శ్రీ దామోదరం సంజీవయ్య గారి గ్రామాన్ని సందర్శించాం. రెండేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చిన్న గుడిసెలో బతికారు. అలాంటి నాయకుడి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా, ఆయన స్ఫూర్తిని అందరూ గుర్తించే విధంగా ఓ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దామన్న ఆకాంక్షతో ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ఆయన ఎంతో చేశారు. మొట్టమొదట ఫించన్లు పెట్టిన వ్యక్తి ఆయన. ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి. పుట్టిన రోజు కదా నేటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గురించి మాట్లాడుదామంటే ఏం మాట్లాడాలి ఆయన చేస్తున్న ఆరాచకాల గురించి చెప్పాలా? కేంద్ర మంత్రిగా రెండుసార్లు పని చేసిన వ్యక్తి ఊరిలో కనీసం ఆయన ఫోటో లేదు. విగ్రహం లేదు. కనీసం ఆ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం లేదు. జనసేన పార్టీ మాత్రం నిజాయితీగా చెప్పిన పని చేస్తుంది. మార్చ్ 31 లోపు ఆ గ్రామానికి ఖర్చు చేసి జనసేన పార్టీ నిలబడుతుంది.

  • నాయకులే బాగుపడుతున్నారు

రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఎదగాలంటే కష్టపడాలి. అనంతపురం జిల్లాలో చూస్తే ఇక్కడ ఓట్లు వేయించుకున్న నాయకుల కుటుంబాలు బాగుపడడం తప్ప ప్రజలకు చేసింది లేదు. వారి కుటుంబాల పట్టుకోసమే ఇక్కడ నాయకులు రాజకీయాలు చేశారు. అన్ని కులాలకు ప్రానిధ్యం ఇవ్వాలన్న ప్రయత్నమే జరగలేదు. జనసేన పార్టీ ఒక్క ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు. యువత కోసం, వారి భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ . యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలి. డబ్బు కోసం చేసే రాజకీయాలు మార్చాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన పార్టీ. అధికార పార్టీ దుర్మార్గాలు ఆగడాల మధ్య ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా 196 ఎంపీటీసీలు గెలిచామంటే అది జనసేన పార్టీకి మాత్రమే సాధ్యపడింది. ఎవ్వరూ ఒక్క ఓటు కొనలేదు. మన భావజాలాన్ని చెప్పుకొని మాత్రమే గెలిచాం. భవిష్యత్తులో అనంతలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు గెలిచే లక్ష్యంతో పని చేయాలి. జిల్లా కమిటీల్లో ఉన్న సభ్యులంతా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ఒక్కో నాయకుడు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుని పని చేయండి.

• అనంతలో ఘన స్వాగతం

అంతకు ముందు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కార్యకర్తలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గుత్తి టోల్ గేట్ వద్ద, అనంతపురం శివారు నారాయణపురం వద్ద జనసేన కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఆడపడుచులు హారతులు పట్టగా, మేళతాళాలతో కార్యకర్తలు ఆహ్వానం పలికారు. జాతీయ రహదారి నుంచి అనంతపురం పట్టణంలోని ఆత్మీయ సమావేశ వేదిక వరకు బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఈశ్వరయ్య, శ్రీ జయరామ్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీ పత్తి చంద్రశేఖర్, శ్రీ అబ్దుల్, శ్రీ నాగేంద్ర, శ్రీ ఆకుల ఉమేష్, శ్రీ సాకే పవన్, శ్రీ శ్రీకాంత్ రెడ్డి, శ్రీ భైరవప్రసాద్, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి పసుపులేటి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.