విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్‌.. 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నారాయణగూడ ఐపీఎంలో టీకాల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. స్లాట్ల కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు టీకా కోసం www.health.telangana.gov.in వెబ్‌సైట్‌లో స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి స్లాట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని గత నెల 30న జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. తద్వారా వారు సురక్షితంగా ప్రయాణం చేసే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది.