వైసీపీది సామాజిక న్యాయభేరీ యాత్ర కాదు… ఘోరీ యాత్ర

  • దళితులకు భవిష్యత్ లేకుండా చేసిన మీకు బస్సు యాత్ర చేసే హక్కు లేదు.
  • దళితుల నరమేధంపై దళిత మేధావుల్లో ఆలోచన మొదలైంది
  • దళితులపై వైసీపీది కపటప్రేమ
  • దళితులు దూరమయ్యారన్న అక్కసుతోనే కోనసీమలో కార్చిచ్చు రగిల్చిన వైసీపీ.
  • బీసీలు, శెట్టిబలిజలు, మైనారిటీలు, దళితులు, కాపులు ఏకతాటిపైకి రావటంతో వైసీపీలో వణుకు మొదలైంది.
  • అధికారం కోసం ఎంతటి దుర్మార్గాలకైనా వైసీపీ తెగిస్తుంది.
  • రాష్ట్ర ప్రజలు సంయమనం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
  • వైసీపీ కుల మత క్షుద్ర రాజకీయాలపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ రాష్ట్ర దళిత నేతలు.

గుటూరు, గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులను అన్నివిధాలా దగా చేసిన వైసీపీ ప్రభుత్వం దళితుల వెన్నుని అడ్డంగా విరిచేసిందని, దళిత బిడ్డలకు భవిష్యత్ లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు సామాజిక న్యాయ భేరీ యాత్ర పేరుతో మరోసారి దళితుల్ని మోసం చేయాలని చూస్తుందని, అది సామాజిక న్యాయ భేరీ యాత్ర కాదని సామాజిక ఘోరీ యాత్ర అని జనసేన పార్టీ రాష్ట్ర దళిత నేతలు నిప్పులు చెరిగారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దళితులకు అరచేతిలో వైకుంఠం చూపించిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమం కోసం, విద్యా, ఆర్థిక అభివృద్ధి కోసం గతంలో ఉన్న పధకాలన్నింటిని వైసీపీ రద్దు చేసి దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. వీటికి తోడు దళితుల యువతులపై అత్యాచారాలు జరుగుతున్న, యువకులను హత్యలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవరిస్తుండటం దుర్మార్గమన్నారు. వైసీపీ అవలంభిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై దళిత యువకుల్లో, విద్యావంతుల్లో, మేధావుల్లో ఆలోచన మొదలైందన్నారు. దీంతో దళితులు వైసీపీకి దూరమవుతున్నారన్న నిఘా వ్యవస్థ సమాచారంతోనే అంభేడ్కర్ పేరుతో దళితుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో పచ్చని కోనసీమలో కుల కార్చిచ్చు రగిల్చారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, మైనారిటీలు, బీసీలు, కాపులు ఏకతాటిపైకి రావటంతో వారి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ క్షుద్ర రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. ప్రజలు సంయమనం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజయ్ కుమార్ కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని డోర్ డెలివరీ హత్యలు కూడా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దళిత డాక్టర్ సుధాకర్ మొదలుకొని రమ్య హత్య, వెలిచెర్ల కిరణ్ హత్య, సుబ్రహ్మణ్యం హత్యల వరకు దళితుల ఊచకోత పరంపరగా జరుగుతున్న వైసీపీలో ఉన్న దళిత నేతలకు, మంత్రులకు సైతం చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. తన శాఖపై ఏ మాత్రం అవగాహన లేని హోంమంత్రి అమలాపురంలో జరిగిన అల్లర్లను జనసేనపై రుద్దాలని చూడటం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సకల శాఖామంత్రి సజ్జల ఇచ్చే స్క్రిప్ట్ ని కాకుండా వాస్తవ సమాచారం తెప్పించుకుని మాట్లాడాలని లేనిపక్షంలో అబాసుపాలు అయ్యే ప్రమాదం ఉందని హితవు పలికారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని, ఆశయాలను, ఆలోచనలను ఆకళింపు చేసుకొని వాటిని గుండెల నిండా నింపుకున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దళితుల పట్ల వారి జీవనవిధానం పట్ల వారి అభివృద్ధి పట్ల నిర్దిష్టమైన ప్రణాళికతో జనసేన ముందుకు వెళ్తుందన్నారు. వైసీపీ ఎన్నికుట్రలు పన్నినా దళితుల్ని జనసేనకు దూరం చేయలేరని గౌతమ్ రాజ్ అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, దళిత నేతలు కొండూరి కిషోర్, కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.