‘విద్యార్థి’ టీజర్‌ విడుదల

చేతన్ చీను(‘రాజుగారి గది’ ఫేమ్) హీరో గా నటిస్తోన్న చిత్రం ‘విద్యార్థి’ “ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్”. శుక్రవారం ఈ ఫిల్మ్ టీజర్‌ను దర్శకులు సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్‌, నిర్మాతలు సాయి కొర్రపాటి, కె.ఎల్‌. దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.

టీజర్‌ను బట్టి ఉద్వేగభరితమైన కథతో ‘విద్యార్థి’ రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. హీరో చేతన్ చీను టైటిల్ రోల్‌లో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. “మన జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం” అంటున్నాడు చేతన్. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడాన్ని సహించలేని హీరోయిన్ ఫ్యామిలీ.. హీరోనీ, అతడి ఫ్రెండ్స్‌నీ హత్య చేయించడానికి పథకం వేశారనీ, తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఒంటరిగా పోరాడాడనీ టీజర్ ద్వారా అర్థమవుతోంది. “ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్” అనే ట్యాగ్‌లైన్ దీన్నే తెలియజేస్తోంది. టీజర్ చివరలో “కంచెలు, కట్టుబాట్లు మంచి చెడుల మధ్య ఉండాలి.. మనుషుల మధ్య కాదు. మనుషుల మధ్య హద్దులుండాలి.. అడ్డుగోడలు కాదు.” అని ఒక లెక్చరర్ క్యారెక్టర్ చెప్తున్న మాటలే ఈ సినిమా కథకు ఆయువుపట్టు అని ఊహించవచ్చు. హీరో చేతన్ చీను క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఆ క్యారెక్టర్‌లో ఆయన పర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంది..