ఆన్ లైన్ లో లీకైన విజయ్ ‘మాస్టర్’!

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ఉండగా, ఎక్కువ నిడివి గల సీన్ల రూపంలో దాదాపు సినిమా అంతా లీక్ అయింది. నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది” అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ వ్యాఖ్యానించారు.