Nellore: ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

తీవ్ర స్థాయి అక్రమాలకు పాల్పడబట్టే వైసీపీకి ఈ గెలుపని విమర్శ

జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో నేడు ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన నేతృత్వంలో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తరఫున 27 మంది అభ్యర్థులు పలు వార్డుల్లో పోటీ చేశారన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, భయబ్రాంతులు పెట్టినా బెదరక నిస్వార్థంగా పార్టీ తరఫున పోటీ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు ఏమాత్రం నిలిచాయో ప్రతి ఒక్కరు గమనించారన్నారు. నామినేషన్ల పర్వం నుండి ఎన్నికల వరకు అధికార పార్టీ ఆగడాలకు, అక్రమాలకు అంతు అనేదే లేకుండా పోయిందన్నారు. ఎన్నికల రోజు సాయంత్రం అన్ని బూత్ లలో ఏజంట్లను బయటకు పంపి గంట పాటు రహస్యంగా బ్యాలెట్ పేపర్ల తారుమారు కూడా చేసారని ఆయన ఆరోపించారు. ఒక్కో డివిజన్ లో సుమారు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి, ఓటర్లకు డబ్బులు పంచి, డబ్బులకు లొంగని ఓటర్లకు వాలంటీర్లను పంపి పథకాలు కట్ చేస్తామని బెదిరించి ఓట్లు వేయించుకున్నారన్నారు. గెలిచిన వారు గుండెల మీద చేయి వేసుకుని తమను తాము అద్దంలో చూసుకుంటే తమ మనఃసాక్షే వారిని ప్రశ్నిస్తుందన్నారు. ఏదేమైనా గెలిచిన 54 మంది వైసీపీ కార్పొరేటర్లకు శుభాభినందనలు తెలియజేసారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టాం కదా, ఇప్పుడు కోట్లు కొల్లగడదామని ఎవరైనా అనుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. తాము కౌన్సిల్ లో లేకపోయినా కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి పనిని గమనిస్తూ ఉంటామని, ఎక్కడ ఏ చిన్న అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా తీవ్రంగా ప్రతిఘటించి జరగకుండా చూస్తామన్నారు. జనసేన పార్టీ పై విశ్వాసంతో ఒక్క పైసా కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఓటేసిన ప్రతి ఒక్క పౌరునికి ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పావుజెన్నీ చంద్ర శేఖర్ రెడ్డి, శిరీష రెడ్డి, కాంతమ్మ, హేమంత్ రాయల్, జీవన్, జఫర్ తదితరులు పాల్గొన్నారు.