మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం: బొత్స

రాజమండ్రిలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు. కంబాలచెరువు పార్క్ లో 6 కోట్ల 54 లక్షల రూపాయల అమృత్ నిధులతో నిర్మించిన డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణు, ఎంపి మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ క్షణం అయినా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని పేర్కొన్నారు. రాజమండ్రిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్ళి అభివృద్ధి అడ్డుకుంటుందని ఆరోపించారు. కోర్టు లో వున్న అంశాన్ని అధికమించి ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని మంత్రి బొత్స విమర్శించారు.అవినీతి, ఒక వర్గం రాజధానిగా అమరావతిని చేయడంతో అభివృద్ధిని 20 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల చట్టం చేశారని తెలిపారు. జడ్పీటీసీ , ఎంపీటీసీ , మిగిలిన 32 కార్పొరేషన్ ,మున్సిపల్ , సహకార ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. రాజమండ్రిని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ను సరైన స్థలం ఎంపిక చేసి త్వరలోనే తరలిస్తామని తెలియజేశారు. రాజమండ్రి- కార్పొరేషన్ ఎన్నికలు కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపే నిర్వహిస్తామని వెల్లడించారు.