స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు వచ్చి ఉపయోగం ఏమిటి?

• వైసీపీ పాలకులు చేతి వృత్తులవారి జీవితాలకు భరోసా లేకుండా చేశారు
• స్వర్ణకారులు ఇక్కట్లలో ఉన్నారు
• విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారుల సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ కి అవగాహన ఉంది
• జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం
• తెనాలిలో స్వర్ణకారుల సంఘం నాయకులతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

పాలకుల్లో స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు కొత్తగా వ్యాపారాలు.. ఉపాధి అవకాశాలు సృష్టించకపోయినా ఉన్నవాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఆ అవగాహన లేదని స్పష్టం చేశారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో చేతి వృత్తులను కులాల వారీగా విడగొట్టి పేదలకు లబ్ధి అందకుండా అన్యాయం చేశారు అన్నారు. హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా చేసింది వైసీపీ పాలకులే అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణకారుల కోసం చక్కటి పాలసీలు రూపొందిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన జీవో కాపీలు స్వయంగా తీసుకువచ్చి స్వర్ణకారులకు అందచేస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మాటిస్తున్నా అని వెల్లడించారు. గురువారం తెనాలి షరాఫ్ బజార్ లో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి దుకాణానికి తిరిగి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేందుకు ముందుకు వచ్చిన యువతకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. స్వర్ణకారుల సమస్యల మీద ఈ ప్రభుత్వం నుంచి స్పందన కరవయ్యింది. స్వర్ణకారులకు చేయూత ఇవ్వడం లేదు. రుణాలు ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్త పర్యటనల సందర్భంలో విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకార సంఘాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వెల్లడించారు. విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారుల ఇక్కట్లపై అవగాహన వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్వర్ణకారులు తమ బిడ్డల్ని ఈ వృత్తిలోకి దించేందుకు ఆలోచించే పరిస్థితులు రావడం దురదృష్టకరం.
* స్వర్ణకారులకు ప్రత్యేక పెన్షన్ తీసుకువస్తాం
ప్రభుత్వంలో ఉన్న వారు స్వర్ణకారులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారులను నిలబెట్టే విధంగా పాలసీలు తీసుకువచ్చి ఆదుకుంటాం. మంచి మార్పు తీసుకువస్తాం. చేతి వృత్తులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కూడా కొన్ని కులాలకే వర్తింప చేస్తున్నారు. అందులోనూ 40 శాతం మందికే ఇస్తున్నారు. కంటిచూపు కోల్పోవడం లాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేది స్వర్ణకారులే. వారి ఆరోగ్యానికి బీమా ఉండాలి. అలాంటి వారికి ప్రత్యేక పెన్షన్లు ఎందుకు ఇవ్వరు? జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక పెన్షన్ పాలసీ తీసుకువస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అందరికీ ఉపయోగపడే పాలసీలు తీసుకువస్తాం. పాలకులు మాట ఇచ్చేటప్పుడు అందులో నిజాయితీ ఉండాలి. విలవలతో కూడిన రాజకీయాలు చేయడం అంటే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేయడం. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి నిలబడుతాం. మన ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదు. అమరావతి ఆగిపోయింది. కలలు కనకుండా మనల్ని నాశనం చేశారు. భవిష్యత్తు లేకుండా చేశారు. జనసేనతోనే అభివృద్ధి సాధ్యం. తెనాలికి పూర్వ వైభవం తెచ్చేలా పని చేస్తా. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి” అన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం నాయకులు గుంటముక్కల కాశీ, చాపల ఆదినారాయణ, జనసేన పార్టీ నాయకులు బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, పసుపులేటి మురళీకృష్ణ, జాకీర్ హుస్సేన్, వేములూరి వెంకట సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.