కాపులకు ఏమి చేశారని వైసీపీని నమ్మాలి?

  • నమ్మించి గొంతు కోసిన వైసీపీని కాపులు జీవితంలో క్షమించరు
  • అంబటి రాంబాబు కాపు కులద్రోహి
  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.

గుంటూరు, కాపులకు ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందని కాపులు వైసీపీ వెంట నడవాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవొద్దు వైసీపీని నమ్మండి అంటూ వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముద్రగడ ఉద్యమాన్ని హైజాక్ చేసి కాపుల్ని మోసం చేసినందుకు, రిజర్వేషన్లు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పినందుకు, కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసినందుకు, ఈబీసీ రిజర్వేషన్లను సైతం కాపులకు దక్కకుండా విద్యా, ఉద్యోగాల్లో తీరని అన్యాయం చేసినందుకు కాపులు వైసీపీని నమ్మాలా అని దుయ్యబట్టారు. కాపులకు వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం 63 సంవత్సరాలు దాటిన మంత్రి అంబటి మరచిపోయి ఉండొచ్చేమో కానీ కాపులెవరూ మరచిపోలేదన్నారు. అంబటికి ఉన్న సమస్త వ్యసనాలను కాపులపై రుద్ది అవమానించి కాపుల మనోభావాలను దెబ్బతీసిన అంబటికి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అంబటి రాంబాబు కాపుల్లో పుట్టినందుకు బాధపడని కాపులేడన్నారు. కాపులపై వైసీపీ చూపిస్తున్న వల్లమాలిన ప్రేమను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జనసేన పార్టీ నుంచి కాపుల్ని వేరు చేయాలన్న దుష్ప్రచారం, విషప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిదని హితవు పలికారు. జనసేనను కాపు పార్టీగా చిత్రీకరించాలన్న వైసీపీ కుట్రలు ఇక సాగవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికి ఏమీ లేక పాడిందే పాట పాసిపళ్ళ దాసా అన్నట్లుగా దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ అర్థంపర్ధం లేని విమర్శలతోనే వైసీపీ నేతల జీవితం అయిపోతుందన్నారు.
ప్లీనరీ సమావేశాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు తలుచుకోకుండా వైసీపీ నేతలు ఉండలేకపోతున్నారని, ఆ స్థాయిలో జనసేన వారిని భయపెడుతోందన్నారు. ప్లీనరీ సమావేశాల్లో వైసీపీ మంత్రులు వాడుతున్న భాష చాలా హేయంగా ఉందని, సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలనపై పెడితే బాగుంటుందని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పాల్గొన్నారు.