పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు: చంద్రబాబు

పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించారని.. ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని విమర్శించారు. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఏం చేప్పారు… ఇప్పుడు జగన్‌ ఏం చేస్తున్నారని నిలదీశారు. అధికారం ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్‌ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్‌ పాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.