విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం ఎందుకు నోరు విప్పరు..?

  • పార్లమెంటులో ఆ ప్రస్తావన ఏదీ?
  • జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది బలిదానంతో ఏర్పాటైందనీ.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని జనసిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ. “అసువులు బాసిన ఆ 32 మందిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు ఐదుగురు చొప్పున ఉన్నారు. వరంగల్, జగిత్యాల ప్రాంతవాసులు ప్రాణ త్యాగం చేశారు. అందుకే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. ఈ విషయాన్ని తెలిపేలా అన్ని ప్రాంతాల వారు బాధ్యత తీసుకునేలా చూడటానికే పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్షను మంగళగిరిలో ఏర్పాటు చేశాం విశాఖపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లాలని, మీరే సారథ్యం వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు. ఇంతవరకు ముఖ్యమంత్రిలో కదలిక లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీల నుంచి అక్కడ ఆ ప్రస్తావనే లేదు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ఉవ్వెత్తున ఉద్యమిస్తుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని మీరెందుకు నోరెత్తరో అర్ధం కావడం లేదు. సోమవారం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీలంతా దీనిపై మాట్లాడాలని కోరుతున్నాం. విశాఖ ఫ్యాక్టరీలో ఉక్కు ఉత్పత్తి పెరిగింది. సంస్థ లాభాల బాట పట్టింది. ఫ్యాక్టరీ ఉద్యోగులు, నిర్వాసితులు ఆందోళనతో చేస్తున్న ఉద్యమాన్ని ప్రజలు అంతా కూడా బలపరచాలి. మీ వెంట జనసేన పార్టీ ఉంటుంది. ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడిన వెంటనే జనసేన స్థానిక నాయకులు అక్కడ ఉద్యమానికి దిగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ ప్రకటన వచ్చిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షా ని, ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. తెలుగువారు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం చేయవద్దని గట్టిగా కోరారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని విన్నవించారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్న శ్రీ పవన్ కళ్యాణ్ వినతిని పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ విషయంపై జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మికులు, నిర్వాసితులకు వెన్నంటి ఉంటాం” అన్నారు.

ఈ సంఘీభావ దీక్షలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, నిర్వాసితుల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. పార్టీ పిఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జులు పాల్గొన్నారు.