జన సైనికులపై దాడులు చేయడంతోపాటు కేసులు పెడతారా?

• ఆకుమర్రు, బేవరపేటల్లో ప్రజల తరఫున మాట్లాడిన వారిపై వైసీపీ దౌర్జన్యం
వై.సి.పి. నాయకుల రాక్షస పాలనకు అంతు లేకుండా పోతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆకుమర్రు, ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం బెవరపేట గ్రామాల్లో జన సైనికులపై వై.సి.పి. దుండగులు జరిపిన దాడిలో ఆకుమర్రులో ముగ్గురు, బెవరపేటలో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండుచోట్లా దాడులకు కారణం ప్రజల తరఫున వై.సి.పి. అక్రమాలను జన సైనికులు ప్రశ్నించడమే. రెండు చోట్లా దాడిచేసినవారే పోలీస్ కేసులు పెట్టడం, అది కూడా సానుభూతి కోసం మహిళలతో కేసు పెట్టించడం వై.సి.పి. వికృత చేష్టలకు పరాకాష్ట అని చెప్పక తప్పదు.
• చెరువు పూడికతీతలో అక్రమాలు
ఆకుమర్రు చెరువు పూడికతీతలో అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న జనసైనికులు శ్రీ హరిరామ్, శ్రీ రామకృష్ణ, శ్రీ గణపతి ఆకుమర్రు వెళ్లి చెరువు పనులను ఫోటోలు తీస్తుండగా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు జన సైనికులను నిర్బంధించి, తీవ్రంగా హింసించి చివరికి వారిని పోలీసులకు అప్పగించి తమపై దాడి చేయడానికి వచ్చారని ఎదురు కేసు పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుని తల్లితో ఈ కేసు పెట్టించారు.
• స్టిక్కర్లు అతికించవద్దు అంటే దాడులా?
జగనన్న స్టిక్కర్లను తమ ఇళ్లకు అంటించవద్దని వారం కిందట బెవరపేటలో జనసైనికులు అన్నందుకు, దానికి తోడు ఊరిలో జరుగుతున్న చెరువు పూడికతీతలో అక్రమాలను ప్రశ్నించడానికి సిద్ధం కావడంతో జనసైనికులపై వై.సి.పి. సంఘవిద్రోహశక్తులను రప్పించి నిన్న రాత్రి జనసైనికులపై విచక్షణరహితంగా దాడి చేయించారు. 12 మంది గాయపడగా ఎనిమిది మందిని స్థానిక ఆస్పత్రిలోను, ఆందోళనకరంగా ఉన్న మరో నలుగురు క్షతగాత్రులను విజయనగరం ఆస్పత్రిలోనూ చేర్పించారు. ఈ జిల్లాకు నేనే పెద్ద దిక్కు అని చెప్పుకునే నాయకుని సోదర దళం గాయపడిన జనసైనికుల కుటుంబాలను కేసు పెట్టవద్దని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఎన్నాళ్ళు ఇటువంటి రాక్షస సంస్కృతిని వై.సి.పి. పెంచి పోషిస్తుంది? ఈ రెండు సంఘటనలపై పోలీస్ అధికారులు జోక్యం చేసుకోవాలని జనసేన పక్షాన కోరుతున్నాము. దోషులను కఠినంగా దండించాలి. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి చేటని గుర్తుంచుకోవాలి. దోషులపై సరైన కేసులు పెట్టని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. గాయపడిన జనసైనికులకు అన్ని విధాలుగా జనసేన అండగా ఉంటుందని పార్టీ తరపున తెలియచేస్తున్నామని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.