అన్నమయ్య ప్రాజెక్టు నిండా అశ్రు పరివాహకం!

* ఏడాది దాటినా మారని అన్నమయ్య ప్రాజెక్ట్ వరద ముంపు బాధితుల బతుకు వెతలు
* కనీస సహాయం అందక, బతుకు చిత్రం మారక జీవచ్ఛవాల్లా బతుకుతున్న బాధితులు
* కొండల్లో బాధితులకు స్థలాలు… ఇళ్ల నిర్మాణం ముందుకు కదలదు
* ఏ ఒక్కరిని కదిలించినా అంతులేని కలతల గాధలు
* ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రి
* వ్యవసాయం లేక, కూలి పనులు కానరాక తినడానికి ఇబ్బందులు
* దాతలు ఇచ్చిన సాయంతోనే రోజులు గడుపుతున్న బాధితులు
* గుడారాలలోనే చలికి వణుకుతూ జీవనం
* అన్నమయ్య ప్రాజెక్టు తెగిన వరద ముంపు గ్రామాలలో శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన

అన్నమయ్య ప్రాజెక్ట్ కన్నీటి వరదతో నిండిపోయింది.. ఏడాదిగా ఏకధాటిగా పారుతున్న బాధితుల కష్టాల ప్రవాహానికి ఈ అమానవీయ సర్కారు కొట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధినేత సాయం చేసే విషయంలో మోసం చేస్తున్న తీరు బాధితుల కడుపు మండేలా చేస్తోంది. పరిహారం ఇవ్వమంటే పరిహాసం చేస్తున్న ప్రభుత్వ అసమర్ధతను బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనలో ఉన్న బతుకులకు ఆలంబనగా ఉండాల్సిన సొంత జిల్లా ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలతో కాలం గడిపేస్తున్న తీరు వేదన కలిగిస్తోంది. మొత్తంగా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన విపత్తు ప్రాంతాల్లో సంవత్సరమైనా అలజడి తగ్గలేదు. బతుకులు మారలేదు. జీవితం ముందుకు సాగటం లేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగి ఏడాది పూర్తయిన సందర్భంగా వరద ముంపు ప్రాంతాలను, బాధిత కుటుంబాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం కలిశారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు, ప్రస్తుతం వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏ ఇంటికి వెళ్లినా, ఏ ప్రాంతంలో పది మందితో మాట్లాడినా మాటలకు అందని అంతులేని ఆవేదన మనసును చలింపచేసింది. సర్వం కోల్పోయి నిత్యం బాధితులు పడుతున్న నరకయాతన శ్రీ మనోహర్ గారిని కదిలించింది. సొంత జిల్లా వారికీ కనీస సహాయం చేయకుండా, అబద్ధాలతో కాలం గడుపుతున్న ఈ ముఖ్యమంత్రికి మానవత్వమే లేదు అనిపించింది.
* ఆ ప్రాజెక్టులాగే మా బతుకులు శిథిలమయ్యాయి
అన్నమయ్య ప్రాజెక్టు వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మందపల్లిలో శ్రీ మనోహర్ గారు బాధితులందరితో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి ఆరా తీశారు. మూడు నెలల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయారని, కొందరి అకౌంట్లో రూ.20 వేలు వేసి చేతులు దులుపుకున్నారని బాధితులు వాపోయారు. రైతులంతా ఇసుక తోలుకున్నామని, కనీసం ప్రాజెక్టు కట్ట పునర్నిర్మిస్తే వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుందని, దాన్ని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు తెగిపోయిన 15 రోజుల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనకు రూ.2 కోట్లు ఖర్చు పెట్టారని, గ్రామంలో నాలుగు సెకన్లు కూడా లేకుండా ముఖ్యమంత్రి వెళ్లిపోయారని చెప్పారు. బాధితులు శ్రీ మనోహర్ గారి ముందు చెప్పిన మరికొన్ని విషయాలు ఇలా…..
* 10 కేజీల బియ్యం, కేజీ ఎర్రగడ్డలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా దాతలు ముందుకు వచ్చి స్పందించిన తర్వాత, జనసేన పార్టీ సాయం అందించిన తర్వాత మాత్రమే ప్రభుత్వ సాయం మాకు అందింది. తర్వాత పరిహారం అందించడంలో, సాయం చేయడంలో ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
* కరెంటు బిల్లులను నిలుపుదల చేయలేదు. ఉపాధి హామీ పనులు ఏ మాత్రం చూపలేదు. కూలి పనులు చేసుకునే వారి బతుకులు కూలిపోయాయి. కూలి పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాతలు ఇచ్చిన సాయం కూడా పక్కదారి పట్టించడానికి అధికారులు ప్రయత్నించారు. ఏడాదికాలంగా దాతలు సహాయం చేస్తున్న నిత్యావసరాలు, బియ్యంతోనే కాలం గడుపుతున్నాం. కోనసీమ లాగా మూడు పంటలు పండే మా పొలాల్లో ఇప్పుడు ఇసుక మేటలు కనిపిస్తున్నాయి.
* ఇటుగా వచ్చిన ఎమ్మెల్యేను, జడ్పీ చైర్మన్ ను కలిసినా మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. కనీసం మా గ్రామాలకు రాకుండా తిరుగుతున్నారు. లెక్కాపత్రం లేకుండా పరిహారం ఇచ్చామని చెప్తున్నారు. తడిచిన ధాన్యం తీసుకుంటామని చెప్పారు. దానికి అతీగతి లేదు. పంట రుణాల మాఫీ ప్రసక్తే లేదు. ఇళ్ల నిర్మాణం గురించి అడుగుతుంటే బెదిరింపులు చేస్తున్నారు.
* పరిహారం గురించి గట్టిగా అడుగుతుంటే, ప్రాజెక్టుకు పటిష్టంగా కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తుంటే ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారు. మా సొంత ఊరు, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోవాలి. పటిష్టమైన కరకట్ట కడితే మాకు వ్యవసాయం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అది చేయాల్సిన అధికారులు మమ్మల్ని ఊరు వదిలి వెళ్లిపోమ్మనడానికి ఏ హక్కు ఉంది..?
* మా బతుకులను ఎడారి చేసింది రాజకీయ నాయకులే. ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత మా ఊరు వచ్చిన ముఖ్యమంత్రి 4 నిమిషాల 40 సెకండ్లు ఉన్నారు. ఒక్కరిని కూడా కలవలేదు. బాధితులు సర్వం కోల్పోయిన దుఃఖంలో ఉంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ చెయ్యి ఊపుకొని వెళ్లిపోయారు.
* ఇసుకలో కూరుకుపోయిన వ్యవసాయ బోర్లు బయటకు తీసేందుకు రూ.15 వేలు ఖర్చు అవుతోంది. విద్యుత్ లైన్లు అంతంత మాత్రంగానే వేశారు. ట్రాన్స్ఫార్మర్లు పెట్టి రైతుల వద్ద కొందరు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఆపదలో ఉన్నాం డబ్బులు అడగకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేదు.
* ఉద్యోగం లేదు.. పింఛను అందదు
ప్రాజెక్టు తెగిపోయిన వరద విపత్తులో మృతి చెందిన శ్రీ ఎం. శంకరయ్య కుటుంబంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. మృతుడు శంకరయ్య కొడుకు బాక్సింగ్లో జాతీయస్థాయి ఛాంపియన్ అయినప్పటికీ,

 క్రీడల కోటాలో ఉద్యోగం రాలేదు. డిగ్రీ చదువుకున్నప్పటికీ ఎలాంటి ఉపాధి లేదు. మృతుడు శ్రీ శంకరయ్య భార్య శ్రీమతి లక్ష్మీదేవికి పింఛన్ రావడం లేదు. దెబ్బ తిన్న ఇంటి కోసం కేవలం రూ.20 వేలు మాత్రమే సాయం అందింది. జాబ్ మేళా కానీ ఉపాధి చూపడం గాని ఈ ప్రభుత్వం చేయలేదని బాధితులు వాపోయారు. ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందో అడిగే ప్రజాప్రతినిధి కూడా లేరని, జనసేన పార్టీ నాయకులు మాత్రమే అండగా నిలిచారని శ్రీ మనోహర్ గారికి చెప్పారు.
* మీ వేదన తీరనిది… మీకు తోడుగా నిలుస్తాం
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన దుర్ఘటనలో ఉమ్మడి కుటుంబానికి చెందిన మొత్తం 9 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబంలో మిగిలిన శ్రీ కొరపాటి రామమూర్తి, చెన్నమ్మ దంపతులను శ్రీ మనోహర్ గారు కలిశారు. వరద సమయంలో కార్తీక మాస పూజలో భాగంగా బలేశ్వర స్వామి ఆలయంలో ఉన్న కుటుంబంలోని తొమ్మిది మంది వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాదం మర్చిపోలేమన్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్న రామమూర్తి దంపతులకు కనీసం బ్రతికేందుకు కూడా ఒక దారి లేకపోవడం మనోహర్ గారిని కదిలించింది. ప్రభుత్వం నుంచి అందిన సాయం ఏ మాత్రం దారి చూపలేకపోయిందని, మొత్తం ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నం అయ్యిందంటూ చెమర్చిన కళ్ళతో శ్రీ మనోహర్ గారికి ఇంటి పరిస్థితిని శ్రీ రామమూర్తి వివరించారు. మీకు కలిగిన వేదన తీరనిది అని, కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని చెబుతూ, పార్టీ నుంచి రూ.50 వేల ఆర్థిక సహాయం వారికి అందజేశారు. జనసేన పార్టీ మానవత్వంతో స్పందించి, అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
* సర్వం కోల్పోయాం.. సాయం అంతంత మాత్రమే
వరదల్లో మేము సర్వం కోల్పోయామని శ్రీ మనోహర్ గారికి శ్రీమతి పసుపులేటి వెంకటసుబ్బమ్మ కన్నీళ్లతో చెప్పింది. ఇంట్లో ఉన్న వస్తువులతో సహా బంగారం, 10 పాడి పశువులు కొట్టుకుపోయాయని, ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 45 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పింది. వరదలో సర్వం కోల్పోయామని అధికారులకు చెప్పినా కేవలం తూతూ మంత్రంగానే సాయం అందించారని వాపోయింది. బీటెక్ చదువుతున్న కొడుకుకు కనీసం ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పింది.
* కలల ఇల్లు కూలిపోయింది
2013లో ఎంతో ఇష్టపడి, సుమారు రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి కట్టుకున్న ఇల్లు వరదల్లో మునిగిపోయిందని బాధితులు వాపోయారు. శ్రీ తిరుమలశెట్టి వెంకటసుబ్బయ్య కువైట్ వెళ్లి దాచుకున్న డబ్బుతో కట్టుకున్న ఇంటిని కళ్ళ ముందే నీరు మింగేసింది. శిథిలాల్లో ఉన్న ఇంటిని చూస్తే గుండె బరువెక్కుతోంది అంటూ బాధితులు శ్రీ మనోహర్ గారి ముందు ఆవేదన చెందారు. ఇసుకలో కూరుకుపోయిన ఇంటి శిథిలాలు సైతం తరలించుకోలేని పరిస్థితి ఉందని, ఏ ప్రభుత్వాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు.
* వేలాది మందిని రక్షించిన లస్కర్ కు దిక్కు లేదు
అన్నమయ్య ప్రాజెక్టు లస్కర్ గా పనిచేస్తూ, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతుందన్న విషయాన్ని గ్రహించి వేలాదిమంది గ్రామస్తులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేసిన తోగూరుపేటకు చెందిన శ్రీ పర్ణ రామయ్య పరిస్థితి చెప్పక్కర్లేదు. 30 సంవత్సరాలకు పైగా కష్టపడి లస్కర్ గా రిటైర్ అయిన రామయ్య దాచుకున్న మొత్తం డబ్బు వరదల్లో కొట్టుకుపోయింది. 60 ఆవులు, రూ. 40 లక్షలకు పైగా ఆస్తి నష్టం వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదం జరగడంతో దాచుకున్న కొద్ది మొత్తం కూడా ఆసుపత్రి ఖర్చులకు వెళ్ళిపోయింది. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం ఏదీ లేదు అంటూ, వేలాదిమందిని రక్షించిన రామయ్య తన పరిస్థితి చెబుతూ శ్రీ మనోహర్ గారి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ప్రాంత రైతులు శ్రీ కేశవరాజు, శ్రీ వెంకటేశ్వర్లు తమ బాధలు తెలిపారు.
* గుడారాలే మాకు శరణ్యం
అక్కడి నుంచి పులపుత్తూరు గ్రామంలో పర్యటించిన శ్రీ మనోహర్ గారు బాధితులతో ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడారు. మూడు కుటుంబాలు ఉమ్మడిగా నివసించే ఇల్లు అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోగా మూడు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి అని, అంతా గుడారాల్లో నివసిస్తున్నామంటూ శ్రీ కుమ్మగిరి పెంచలయ్య భార్య శ్రీమతి భారతి చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి తమకు ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ లేదని, ఏం చేయాలో తెలియక ఇలా గడుపుతున్నామంటూ వాపోయారు.
* మూడు నెలల చిన్నారితో చలికి ఉండలేకపోతున్నాం
కోడలు, ఆమెకు పుట్టిన 3 నెలల బిడ్డతో గుడరాల్లో ఉండలేకపోతున్నామని శ్రీమతి ఈటుమార్పు చిన్నక్క అనే మహిళ మనోహర్ గారితో తన గోడు వెళ్లబోసుకుంది. ఇంటి స్థలం ఇచ్చామని చెప్పినా, దానిని కట్టుకునే స్తోమత తమకు లేదని, సర్వం కోల్పోయిన తమకు ఇప్పుడు జీవనమే చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పూర్తిస్థాయిలో తమకు ఏవీ అందలేదని, ఇల్లు కూడా కట్టుకోలేని స్థాయిలో గుడారాల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోరున విలపించింది. చంటి పిల్లలతో, విష కీటకాలు వస్తాయేమోనన్న భయం ఉందని వాపోయింది.
* బాధితులకు కొండలు, గుట్టల్లో ఇళ్లా?
అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో వారికి కేటాయించిన స్థలాలే చెబుతున్నాయని శ్రీ మనోహర్ గారు అన్నారు. పులపుత్తూరులోని బాధితులకు కేటాయించిన మూడు లే అవుట్లను శ్రీ మనోహర్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కూలీలతో పాటు, గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం గృహాల నిర్మాణ పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ” మొత్తం 446 ఇళ్లలో ఒకటి కూడా పూర్తి కాకపోవడం, భవిష్యత్తులోనూ పూర్తి అయ్యేలా కనిపించకపోవడం అత్యంత విచారకరం. పునాదులు కూడా ఇప్పటివరకు వేయకపోవడం విడ్డూరంగా ఉంది. మూడు నెలల్లో ఇల్లు కట్టించి, తాళాలు చేతిలో పెడతాను అన్న పెద్దమనిషి జాడే కనిపించడం లేదు. మాకు ఇల్లు ఎక్కడ అని బాధితులు అడుగుతుంటే దబాయింపులతో కాలం గడుపుతున్నారు. పునాదుల వరకు నిర్మిస్తే ఆ తర్వాత రూ.1.20 లక్షలను ఇస్తామని చెప్పడం దారుణం. సర్వం వరదలకు కొట్టుకుపోయిన బాధితులు ఇప్పుడు ఇల్లు నిర్మించే బాధ్యతను ఎలా తీసుకుంటారు..? ఇంటి నిర్మాణాల పరిస్థితిని చూస్తుంటే మరో మూడు సంవత్సరాలు అయినా ఇల్లు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. గత నెల రోజుల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి. ఇది సొంత జిల్లా బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చే భరోసా. కష్ట కాలంలో వారికి సంబంధించిన నిధులు కూడా ఇవ్వలేని దుర్మార్గపు ఆలోచన ఆయనది. స్పందించే మనసు లేని ఈ ముఖ్యమంత్రి కి పాలించే అర్హత కూడా లేదు. కనీస మానవత్వం మరిచిన ఈ ముఖ్యమంత్రి వెంటనే తన పదవి నుంచి దిగిపోవాలి. లేకుంటే కడుపు మండిన ప్రజలు ఆగ్రహంతో దించేస్తారు.
* బాధితులతో కలిసి న్యాయం జరిగేలా పోరాటం
అన్నమయ్య ప్రాజెక్టు ముంపు బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. దుర్ఘటన జరిగిన వెంటనే రెండు రోజుల్లోనే స్పందించి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు స్వయంగా నేను అప్పట్లో నే పర్యటించాను. అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి ఏమాత్రం తేడా లేదు. వెంటనే స్పందించి బాధితులకు ధైర్యం చెప్పాం. వారికి తోచినంత సహాయం అందించాం. ప్రాథమిక అవసరాలను తీర్చగలిగాం. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఏడాది అయినా అదే కష్టంలో ఉన్నారు. కచ్చితంగా ఈ కష్ట సమయంలోనూ జనసేన పార్టీ బాధితులకు అండగా నిలుస్తుంది. ఇప్పటికే పార్టీ తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలియాలి. అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల గోడు ప్రజలకు వినపడాలి. డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో క్షేత్రస్థాయి పరిస్థితిని అందరికీ వివరిస్తాం. ప్రజల మద్దతు కోరుతాం. అప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా బాధితులతో కలిసి పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల హక్కులను సాధించుకుంటాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులకు అండగా నిలబడటంలో ముందు ఉంటారు” అని శ్రీ మనోహర్ గారు చెప్పారు.
* పేలుళ్ల వల్ల మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరామర్శ
అన్నమయ్య ప్రాజెక్ట్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం మంగంపేట బెరైటీస్ పేలుళ్ల వల్ల 

అగ్రహారం గ్రామంలో మూడు రోజుల క్రితం గోడ కూలి మూడేళ్ల బాలుడు ఈశ్వర్ దుర్మరణం పాలైన విషయాన్ని తెలుసుకున్న శ్రీ మనోహర్ గారు ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ చిన్నారి తల్లితండ్రులు శ్రీమతి పుల్లగంటి అరుణ, శ్రీ మల్లికార్జునలను ఓదార్చారు. వారికి తగు న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని, కచ్చితంగా అటు నుంచి తగు న్యాయం జరిగేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అగ్రహారం గ్రామస్తులు మైనింగ్ పేలుళ్ల వల్ల తమకు ఎదురవుతున్న ప్రాణాపాయాన్ని వివరించారు. స్కూల్ భవనం కూడా బీటలు వారి ప్రమాదకరంగా ఉందని వాపోయారు.