బొగ్గు కొరతతో.. విద్యుత్ సంక్షోభం అంచున ఏపీ

ఏపీలో విద్యుత్ సంక్షోభం తప్పేలా లేదు. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి తగినంత సహకారం లభించకపోవడం వంటి కారణాలతో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్పటికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంతరించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా విద్యుత్ కోతలు విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. తెలంగాణలోని సింగరేణి గనులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్ ప్లాంట్లు అల్లాడుతున్నాయి. దీంతో రోజువారీ ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ లో సగం కూడా ఉత్పత్తి చేయలేని పరిస్ధితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలోని ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, వీటీపీఎస్, ఎస్టీపీఎస్, ఎంటీపీఎస్ ఇలా ఎక్కడ చూసినా బొగ్గు సంక్షోభం రాజ్యమేలుతోంది. దీంతో ఆయా ప్లాంట్లు ఉత్పత్తిలో కోతలు విధించుకోక తప్పని పరిస్ధితులు తలెత్తాయి. ఈ ప్రభావం సహజంగానే విద్యుత్ ఉత్పత్తిపై పడుతోంది. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా విద్యుత్ కోతలు విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. కారణం ఏదైనా ఏపీలో విద్యుత్ సంక్షోభం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లపైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం కేంద్రంపై భారం వేసి చోద్యం చూస్తోంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్ నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలా చేయాలన్నా ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు ఉండాలి. కానీ అలాంటి పరిస్ధితి లేదు. దీంతో ఓవైపు బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతోంది. విద్యుత్ కోతలు తప్పేలా లేవని, ప్రజలు అందుకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది.